మీరేదైనా వస్తువును కొనడం గురించి మీ స్నేహితునితో చెప్పారు. అది మెసేజ్లోనైనా.. ఫోన్లోనైనా కావొచ్చు. మరుసటి రోజు అదే వస్తువు/ఐటం గురించి మీ ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తే? ఎక్కడైనా ప్రకటనలో కనిపిస్తే? ఇది నిజంగా మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్ మన మాటలు వింటుందా అని ఆలోచిస్తారు కదా?
అయితే ఇది నిజమేనా? మన ఫోన్ మన మాటలు వింటుందా? అది యాదృచ్ఛికం కాకపోవచ్చు.
అంటే.. మీ ఫోన్ మీ సంభాషణలు వింటుందని దానర్థం కాదు. ఆ అవసరం కూడా లేదు. కానీ.. మీరు ఇప్పటికే దానికి అవసరమైన మొత్తం సమాచారం ఇచ్చి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఫోన్లు వింటాయా?
మనలో చాలా మంది.. మన సమాచారాన్ని ఎన్నో వెబ్సైట్లు, యాప్‌లకు ఇస్తుంటాం. ఆన్లైన్ కార్యకలాపాలు కొనసాగించడానికి కుకీలను అనుమతించడం, పర్మిషన్స్‌కు అంగీకరించడం వంటి ద్వారా కొన్ని అప్లికేషన్లు ఈ సమాచారం సేకరిస్తాయి.
ఫస్ట్ పార్టీ కుకీస్ అని పిలిచే కొన్ని.. ఆయా వెబ్సైట్లలో మన వివరాలు ఎల్లప్పుడూ ఉండేలా అనుమతిస్తాయి. అంటే ప్రతిసారీ వినియోగదారుడు.. తమ తమ లాగిన్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే లోపలికి వెళ్లేలా ఇది అనుమతిస్తుంది. ఇక్కడే మోసపోతారేమో గ్రహించండి.
మీరు చూడాలనుకున్న వెబ్‌సైట్/యాప్‌కు భాగస్వామిగా ఉన్న ఏదైనా మార్కెటింగ్ సంస్థ లేదా ఇంకేదైనా.. థర్డ్ పార్టీ కుకీస్‌తో మీ సమాచారాన్ని గ్రహిస్తాయి. మీరు కొన్ని పాప్అప్లను క్లిక్ చేయడం వల్ల కూడా ఇది జరగొచ్చు. ఇక మీరేం కోరుకుంటున్నారో వాటికి ఇట్టే తెలిసిపోతుంది. అలా ప్రకటనల రూపంలో మీ ఫోన్లలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది.
మీ జీవితచక్రం వారి చేతుల్లోకి..
ఇది జరగడం కారణంగా.. ఆ ప్రకటనదారు మీ నిత్యకృత్యాలు, అవసరాలు, కోరికలు ఇలా మీకేం కావాలో గ్రహించగలడు. ఇలాంటి కంపెనీలు కొన్ని.. తమ ఉత్పత్తులపై కస్టమర్ల స్పందన, ప్రజాదరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటికి ఇవి ఉపయోగపడతాయనడంలో సందేహమే లేదు.
కంప్యూటర్ల సాయంతో..
అడ్వర్టైజర్లకు ఈ సమాచారం చాలు. మీ వయసు, లింగం, ఎత్తు, ఉద్యోగం, అలవాట్లు అన్నీ తెలుసుకొని.. వాటికి తగ్గట్లుగా ప్రొడక్ట్స్‌ను మీ ముందు ఉంచుతాయి. అందుకే నిర్దిష్ట కస్టమర్‌కు సరైన యాడ్లు చేరవేసేందుకు అవి ప్రత్యేక వ్యవస్థలను కలిగి ఉంటాయి. అందులో కృత్రిమ మేధ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ), రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్(ఆర్ఎల్) వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.
కంప్యూటర్లలోనే రహస్యమంతా! ఇవి మనమేం చేస్తున్నాయో ఇట్టే గ్రహిస్తాయి.
ఉదాహరణకు.. మనం ఒక సోషల్ మీడియో పోస్ట్‌ను చూడటం/ లైక్ కొట్టడం వంటివి చేశామనుకోండి. వెంటనే ఆర్ఎల్ ఏజెంట్‌కు రివార్డ్ సిగ్నల్ వెళ్తుంది. మీరు ఆ పోస్ట్ పట్ల ఆకర్షితులవడం లేదా పోస్ట్ చేసిన వ్యక్తిని అభిమానించడం/ ఆసక్తి చూపించడం వంటివి పసిగడుతారు. ఎలాగైతే ఏంటి.. చివరకు మీ వ్యక్తిగత ఆసక్తులు, ప్రాధాన్యాలు, ఇష్టాలు.. ఆర్ఎల్ ఏజెంట్‌కు వెళ్తాయి.
అప్పుడు మీరు అదేపనిగా అలాంటి ప్రొడక్ట్స్‌ను లైక్ కొట్టడం వంటివి చేస్తుంటే.. సంబంధిత కంపెనీల కోసం ప్రకటనలు మీకు వచ్చే విధంగా వ్యవస్థ ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).
అన్ని ప్రకటనలు అప్పుడప్పుడు మీ ఆసక్తుల మేరకే రాకపోవచ్చు కూడా. మీరు ఇంకా చాలా తప్పులే చేసి ఉండొచ్చు.
- సంబంధిత ప్లాట్‌ఫాంలో ఇతర యాడ్లను క్లిక్ చేయడం.
- సామాజిక మాధ్యమాలు/ వేదికల్లో మీ వ్యక్తిగత సమాచారం ఉంచడం/ షేర్ చేయడం( వయసు, ఈ-మెయిల్, లింగం, లొకేషన్ వంటివి).
- మీరు అప్పటికే కొన్ని మార్కెటింగ్ సంస్థలు/ అడ్వర్టైజర్లకు కస్టమర్లుగా ఉన్నట్లయితే.. వారు ఇతర ప్లాట్‌ఫాంలకు మీ సమాచారం ఇచ్చే అవకాశాలున్నాయి.
చివరగా మీరు రోజువారీగా చేసే పనులు, మీ చుట్టూ జరిగే విషయాలను నిశితంగా పరిశీలించి మార్కెటర్లకు చేరవేయడంలో ఏఐ అల్గారిథంలదే కీలక పాత్ర. ఇది కేవలం మీ సమాచారాన్ని మాత్రమే సేకరించి.. మిమ్మల్ని లక్ష్యంగా చేసుకొని యాడ్లు పంపుతుందని అనుకోవద్దు. అదే ప్లాట్ఫ్లాంలను ఉపయోగించే మీ స్నేహితులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల దగ్గరనుంచీ సమాచారం పొందుతుంది.
ఉదాహరణకు.. మీ స్నేహితుడు ఇటీవల కొన్న ఓ వస్తువును ఫేస్బుక్ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో సిఫార్సు చేయవచ్చు. దీని కోసం.. అడ్వర్టైజర్లు/ మార్కెటర్లు మీకు, మీ స్నేహితుడికి మధ్య జరిగిన సంభాషణను వినాల్సిన అవసరం లేదు కదా.
వీటి విషయంలో జాగ్రత్త..
మన నుంచి ఏ సమాచారం సేకరిస్తున్నాం.. నిల్వచేస్తున్నాం.. అనే వివరాలపై యాప్ ప్రొవైడర్లు మనకు తెలియజేయాల్సి ఉండగా, అన్నీ అలా చేయట్లేదు. ఇలాంటి వాటి పర్మిషన్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.
మీకు అనుమానం కలిగినప్పుడు.. ఒకటికి పదిసార్లు ఆలోచించి అనుమతులు ఇవ్వడం నేర్చుకోండి.
వాట్సాప్ వంటి యాప్‌లు.. కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుతాయి. దీనికో అర్థం ఉంది. ఇవి లేకుండే మీరు వాట్సాప్‌లోని అన్ని సేవలను పొందలేరు. కానీ.. అన్ని యాప్‌లు వాటికి అవసరమైన వాటికే యాక్సెస్‌ను అడుగుతాయని చెప్పలేం. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా మార్కెటర్లకు ఏఐ పంపే ప్రతిపాదనలు.. మిమ్మల్ని ఒక చట్రంలో ఇరుక్కునేలా చేయొచ్చు. సుదీర్ఘ జీవనకాలంలో.. మీ ఎంపికలను పరిమితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్‌నే పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉంది.
అంతా మీ చేతుల్లోనే..
మీరు ఆన్లైన్లో షేర్ చేసే డాటాను పరిమితం చేసేందుకు.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.
- మీ ఫోన్లో ఉన్న యాప్ పర్మిషన్లను రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి.
- యాప్/ వెబ్‌సైట్ మిమ్మల్ని పర్మిషన్ కోరే ముందు, కుకీలను అనుమతించమని చెప్పే ముందు.. వాటికి అంగీకరించాలా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
- ఇతర వెబ్సైట్లు, సేవలను పొందేందుకు.. లాగిన్/ కనెక్ట్ అయ్యేందుకు మీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించడానికి సాధ్యమైనంత దూరం ఉండాలి.
- ఎక్కువగా.. ఈమెయిల్ ద్వారానే లాగిన్ అడుగుతాయి. అయినా.. దాని విషయంలోనూ జాగ్రత్తపడాలి.
మీరు ఒకసారి సైన్ ఇన్ అయ్యాక.. అవసరమైన సమాచారమంతా ఇస్తున్నామన్న దానిని గుర్తుంచుకోవాలి. మీరు మీ సమాచారం గురించి గోప్యంగా ఉంచుకోవాలనుకుంటే.. మీ ఫోన్లో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్)ను ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇది ఐపీ చిరునామాను గోప్యంగా ఉంచుతుంది. ఇంకా.. ఆన్లైన్లో మీరు చేసేవి/ చూసేవి బయటకు పొక్కకుండా చేస్తుంది.
మీరూ ప్రయత్నించండి..
ఇప్పటికీ ఫోన్ మీ మాటలు వింటుందని మీరనుకుంటుంటే ఇదొకసారి ప్రయత్నించాల్సిందే.
- మీ ఫోన్ సెట్టింగ్స్‌ల్లోకి వెళ్లి.. అన్ని యాప్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్‌ను డిసేబుల్ చేయండి. మీరింతవరకు ఫోన్లో సర్చ్ చేయని, ఒక ప్రొడక్ట్ గురించి కొంత దూరంలో ఉండి మీ స్నేహితులతో గట్టిగా మాట్లాడండి.
- కావాలంటే కొన్ని సార్లు మళ్లీ మళ్లీ అదే పని చేయండి.
- అప్పుడు.. మీరు కోరుకున్న వస్తువుకు సంబంధించి ప్రకటనలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోకుంటే మీ ఫోన్ మాటల వినట్లేదని నిజంగానే తెలిసిపోతుంది.
మీ మనసులో/ఆలోచనల్లో ఏముందో తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌కు ఇతర మార్గాలు ఉన్నాయి. అంతేగానీ.. అది మన మాటలు వింటుందని చెప్పలేం. ఇదే నిజం. కాబట్టి ఇప్పటినుంచి మీరు జాగ్రత్తపడండి. కుకీస్ సహా ఇతర థర్డ్ పార్టీ పాప్అప్లను క్లిక్ చేసే/ అనుమతించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడం మంచిది.
ఇదీ చదవండి: రాత్రివేళల్లో స్మార్ట్‌ఫోన్ వాడితే.. పురుషులకు ఈ సమస్య తప్పదు!
స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ కాలం తుంపర్లు!
'భారతీయులు స్మార్ట్‌ఫోన్‌ను తెగ వాడేస్తున్నారు'