IPhone 15 Launch :ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసిన యాపిల్ మెగా ఈవెంట్ పూర్తయింది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘వండర్ లస్ట్’ పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 లను కూడా విడుదల చేసింది. ఈ సారి ఐఫోన్ 15లో టైప్-సీ ఛార్జింగ్ పోర్టును అమర్చడం విశేషం. ఇక వాచ్‌ల విషయానికి వస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండేలా వాటిని రూపొందించారు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో ఎయిర్పాడ్లను మాత్రం యాపిల్ కంపెనీ విడుదల చేయలేదు. బహుశా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఐఫోన్లు, వాచ్‌ల్లో ఉన్న బెస్ట్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫీచర్స్
IPhone 15 Features : ఐఫోన్ 14 మోడల్‌లో ఉన్నట్లే ఐఫోన్ 15లోనూ 6.1 అంగుళాల స్క్రీన్, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను అమర్చారు. ముఖ్యంగా వీటిలో ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగు వేరియంట్లలో ఈ ఐఫోన్లు అందుబాటులో ఉంటాయి. డైనమిక్ ఐలాండ్‌తో కూడిన కొత్త నాచ్ డిస్‌ప్లే, వెనక వైపు 2X టెలిఫొటో సామర్థం ఉన్న 48 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 24mm, 28mm, 38mm లెన్స్‌లను కూడా ఉన్నాయి. వీటితో యూజర్లు హైరిజల్యూషన్ ఫొటోస్, వీడియోలను తీసుకోవచ్చు. తక్కువ కాంతిలో కూడా ఫొటోలు తీసుకునే విధంగా ఈ కెమెరాను రూపొందించడం విశేషం. ఏ16 బయోనిక్ చిప్ సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఈ సారి కొత్తగా ఇచ్చారు.
ఐఫోన్ 15 ధరలు
IPhone 15 Price :
- ఐఫోన్ 15 ధరను భారత్‌లో రూ.79,900 గా నిర్ణయించారు.
- ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,899 గా ఉంది.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫీచర్స్
IPhone 15 Pro Features :ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల స్క్రీన్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల స్క్రీన్ ఇచ్చారు. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లు టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్ అనే నాలుగు వెరియంట్లలో లభిస్తాయి. ఈ ఫోన్స్ వెనక వైపు 48 మెగాపిక్సల్ కెమెరా.. అలాగే 3 ఫోకల్ లెంగ్త్ కెమెరాను కూడా అమర్చారు. ఐఫోన్ 15 ప్రోలో 3X ఆప్టికల్ జూమ్, 15ప్రో మ్యాక్స్‌లో 5X టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు.