Iphone 15 Battery Life Charging Speed :యాపిల్, ఆండ్రాయిడ్.. ఇలా ఏ రకం ఫోన్లైనా సరే మొబైల్ సంస్థలు అప్డేటెడ్ వెర్షన్లను రిలీజ్ చేస్తుంటాయి. అయితే ఇలా ప్రతి ఏడాది లేదా అవసరాన్ని బట్టి ఒక మోడల్‌కి సంబంధించి వెర్షన్లు విడుదల చేసేముందు అందులో ప్రధాన మార్పులను తీసుకువస్తాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు మొత్తం 14 వెర్షన్లను లాంఛ్ చేసిన ప్రముఖ ప్రీమియం గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా ఐఫోన్ 15 సిరీస్‌ను లాంఛ్ చేసింది. అయితే ఇందులో వినియోగించిన USB-C ఛార్జింగ్ కనెక్టర్పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఐఫోన్లలో చాలావరకు లైట్నింగ్ కనెక్టర్ కేబుల్‌నే వాడారు. కాగా, ప్రస్తుతం దీనికి బదులుగా టైప్-సీను ఐఫోన్ 15 సిరీస్‌లో వినియోగించారు.
Iphone 15 Charger Type : ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల కంపెనీలు కూడా ఈ రకం ఛార్జింగ్ కనెక్టర్లను తమ ఉత్పత్తుల్లో వాడుతున్నాయి. అంతేకాకుండా యాపిల్‌కి చెందిన పలు ప్రాడక్ట్స్లైన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ లాంటి వాటిల్లో కూడా ఈ USB టైప్-C ఛార్జింగ్ కనెక్టర్‌ను గమనించవచ్చు. మరి ఇవన్ని దృష్టిలో ఉంచుకొని యాపిల్ తాజాగా తెచ్చిన ఐఫోన్ 15 బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరిచిందా? లేదా అలాగే USB-C ద్వారా ఛార్జింగ్ మరింత వేగంగా ఎక్కేలా ఏమైనా మార్పులు చేసిందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇలా కనెక్టర్ విషయంలో ఏ మాత్రం ప్రత్యేకత లేకుండా ఇప్పటికే ఉన్న వెర్షన్లలో వాడిన కనెక్టర్నే అమర్చడంపై మొబైల్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ టైప్-సీ కనెక్టర్ అనేది ఫోన్ బ్యాటరీ లైఫ్ సహా ఛార్జింగ్ స్పీడ్‌పై ప్రభావం చూపుతుందని అంటున్నారు టెక్ నిపుణులు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14, 15 సిరీస్‌ల మధ్య ఏమైనా తేడాలున్నాయా లేవా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్15, ఐఫోన్ 15 ప్రో బ్యాటరీ లైఫ్!
ఐఫోన్ 15 లాంఛ్ సమయంలో యాపిల్ ఈ సిరీస్‌కి సంబంధించి బ్యాటరీ కెపాసిటీల వివరాలను తెలపనప్పటికీ.. అవి ఎంతకాలం పాటు మన్నికగా ఉంటాయనే వాటికి సంబంధించి అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ఐఫోన్ 15 బ్యాటరీకి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 16 నుంచి 20 గంటల వరకు ఉంటుందని తెలిపింది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 20 నుంచి 26 గంటల వరకు ఉంటుందని యాపిల్ చెబుతోంది.
పెద్దగా మార్పులు చేయలేదు!
గతేడాది తీసుకువచ్చిన ఐఫోన్ 14 సిరీస్‌లోని ఛార్జింగ్ స్పీడ్‌నే ఐఫోన్ 15 సిరీస్‌లోనూ గమనించవచ్చు. కాగా, ఈ రెండింటి బ్యాటరీ లైఫ్ సహా ఛార్జింగ్ స్పీడ్‌లో పెద్దగా మార్పులేమి గుర్తించలేదని నిపుణులు అంటున్నారు. దీని కారణంగానే చాలావరకు ఐఫోన్ లవర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.