యాపిల్ కంపెనీ ఐఫోన్ 13 మోడల్స్(iphone 13 models comparison) విడుదల తేదీని ప్రకటించినప్పటి నుంచి నెట్టింట్లో ఎక్కడ చూసినా వాటి గురించే చర్చే. ధరెంత.. ఎలాంటి ఫీచర్లున్నాయి.. ఐఫోన్ 12 సిరీస్‌కు ఐఫోన్ 13 ఏమేం తేడాలుంటాయి.. ఇలా ఎన్నో సందేహాలు. వాటికి తెరదించుతూ యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. అయినప్పటికీ యూజర్స్‌లో ఐఫోన్ 13 గురించి ఎన్నో ప్రశ్నలు. మరి ఆ ప్రశ్నలు ఏంటి? వాటికి సమాధానాలేంటో తెలుసుకుందాం.
ప్రో మోషన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది?
యాపిల్ తొలిసారిగా ఐఫోన్ 13 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే సౌకర్యం కల్పించింది. అయితే ఇందులోని ప్రో మోషన్ ఫీచర్(iphone 13 pro motion) మనం చూసే వీడియో ఆధారంగా ఎంత రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉండాలనేది నిర్ణయిస్తుంది. దానివల్ల బ్యాటరీ ఆదా అవడమే కాకుండా.. బ్యాటరీ పనితీరు, జీవితకాలం మెరుగవుతాయని యాపిల్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ యూజర్స్ కంట్రోల్ చేయాలా? లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేస్తుందా? అనేది చాలా మంది సందేహం. ఈ ప్రో మోషన్ కంట్రోల్ ఏఐ సాయంతో పనిచేస్తుందని యాపిల్ వెల్లడించింది.
మరి సినిమాటిక్ మోడ్?
ఐఫోన్ 13 సిరీస్ అన్ని మోడల్స్‌లో వీడియోల కోసం సినిమాటిక్ మోడ్ ఇస్తున్నారు. ఇది మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఐఫోన్‌తో వీడియోలు తీసేప్పుడు అందులోని ఫోకస్‌ను ఆటోమేటిగ్గా మార్చుకుంటుంది. ఉదాహరణకు కెమెరా ఫోకస్ నుంచి ఫొటో ఆబ్జెట్ పక్కకు జరిగితే కెమెరా ఫోకస్‌ను ఆటోమేటిగ్గా దాని మీదకు మార్చుకుంటుంది. అయితే ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలో ఈ ఫీచర్ ఆటోమేటిగ్గా పనిచేస్తే.. ఐఫోన్ ప్రో(iphone 13 pro) మోడల్స్‌లో ఏ ఆబ్జెట్ మీద ఫోకస్ చేయాలనేది అవే నిర్ణయించుకుని ఫోకస్‌ను హోల్డ్ చేసి అవసరమైనప్పుడు విడుదల చేస్తాయి. అలానే వీడియో ఎడిట్ చేసేప్పుడు కూడా ఫోకస్ యూజర్‌కు నచ్చినట్లుగా మార్చుకోవచ్చని యాపిల్ ప్రకటించింది.
ప్రోరెస్ వీడియో అంటే?
ఫోన్‌లోనే వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు వీలుగా 2007 నుంచి ఐఫోన్ మోడల్స్‌లో యాపిల్ ప్రోరెస్ వీడియో ఫీచర్‌ను ఇస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో యాపిల్ తన సొంత వెర్షన్ ప్రోరెస్ వీడియో ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ సాధారణ వీడియోలతో పాటు హై క్వాలిటీ వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని యాపిల్ తెలిపింది. అలానే యూజర్స్ రా వీడియో ఫైల్స్‌ను ఇతర ఫార్మాట్‌లలోకి మార్చుకోవాల్సిన అవసరంలేదని పేర్కొంది. ఐఫోన్ 13 ప్రో మోడల్స్‌లో పెద్ద సైజ్ ఫైల్స్‌ను స్టోర్ చేసుకునేందుకు వీలుగా 1టీబీ స్టోరేజ్‌ను ఇస్తున్నారు.