ప్రతి ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ పరికరాలు ఉన్నాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయటం ప్రస్తుతానికైతే చాలా తక్కువ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) ద్వారా ఈ పరికరాలన్నీ ఒకదానితో మరోటి కనెక్ట్ అయి తెలివిగా నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహారణకు ఇంట్లో ఫ్యాన్, లైట్, ఇతర పరికరాలను వాటికవే నియంత్రించుకుంటాయి.
సాంకేతికంగా చూసుకున్నట్లయితే ప్రతి స్మార్ట్ పరికరం కొంత మొత్తంలో డాటాను సేకరిస్తుంది. వీటిని విశ్లేషిస్తూ ఇంటర్ కనెక్టెడ్ పరికరాలు పనిచేస్తాయి. దీనికోసం క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధను ఉపయోగించుకుంటాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు మానన జీవితాలను మార్చివేసే శక్తి ఉంది. ఏఏ అంశాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుందో తెలుసుకుందాం
ఎలక్ట్రానిక్స్:కొన్ని రోజుల క్రితం కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది. ప్రస్తుతం ప్రతీ పరికరానికి నెట్ కనెక్షన్ ఉండాలని కోరుకుంటున్నారు. దీనికోసం అవి కూడా స్మార్ట్ రూపంలోకి మారిపోతున్నాయి. టెలివిజన్లు, రిఫ్రిజరేటర్లు, స్పీకర్లు, హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు స్మార్ట్‌గా మారిపోయాయి. హృదయ స్పందన,క్యాలరీలు, నిద్ర నాణ్యత తదితర ఫిట్ నెస్ అంశాలను తెలుసుకునేందుకు ఇప్పటికే స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ బ్యాండ్లను వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి విషయంలో మరింత పురోగతి వస్తుంది. ముందే ఇచ్చిన కమాండ్స్‌కు అనుగుణంగా వాటంతట అవే పనిచేసే వెసులుబాటు భవిష్యత్తులో ఉంటుంది.
స్మార్ట్ హోమ్స్: ఇంటిని పూర్తి అధునాతనంగా మార్చే శక్తి ఐఓటీకి ఉంది. ఇంట్లోకి వెళ్లాక ఫ్యాన్, ఏసీ తదితరాలను ఆన్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. ఐఓటీ సాంకేతికతో మనం ఇంటిలోకి ప్రవేశించగానే ఏసీ దానికదే ఆన్ అవుతుంది. లేదా ఇంటికి వెళ్లేకంటే ముందే ఏసీ ఆన్ చేసుకునే వీలు ఉంటుంది. స్మార్ట్ గ్యాడ్డెట్లు, స్మార్ట్ పరికరాలతో ఇంటి లోపలి అనుభూతి పూర్తిగా మారిపోనుంది.
కార్లు:కనెక్టెడ్ కార్లకు సంబంధించి ఇప్పటికే ప్రోటోటైప్లను పలు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి అంతిమ వినియోగదారులకు చేరేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఐఓటీ ద్వారా కార్డు, డ్రైవర్లు, ఇతర రకాల మౌలిక సదుపాయాలు సంభాషించుకొని సురక్షితమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతేకాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కింగ్ మేనేజ్మెంట్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించుకోవచ్చు.