what is coal:శిలాజాల తరగతిలో అత్యంత అధికంగా ఉన్న ఇంధనం బొగ్గే. దీనికి సుదీర్ఘ చరిత్రే ఉంది. గుహల్లో నివసించే ఆదిమ మానవుల దగ్గర్నుంచే బొగ్గు వాడకం మొదలైంది. చూడటానికిది మెరుస్తున్న నల్లరాయిలా కనిపిస్తుంది గానీ లోపల చాలా శక్తే ఇమిడి ఉంటుంది. బొగ్గును మండించినప్పుడు వేడి, కాంతి శక్తి పుట్టుకొస్తాయి. ఇదే ఆదిమ మానవుడిని ఆకర్షించి ఉంటుంది. గుహల్లో వేడి కోసం దీన్ని మండించటం ఆరంభించారు. ఆ తర్వాత వంటకు వాడుకోవటం మొదలెట్టారు. కలప కన్నా బొగ్గు ఎక్కువసేపు మండుతుంది. అంత తరచుగా సేకరించాల్సిన పనీ ఉండదు. అందుకేనేమో బొగ్గు వాడకం వారికి తేలికైన పనిగా మారిపోయింది. అప్పట్నుంచీ మనిషిని బొగ్గు ఆకర్షిస్తూనే ఉంది.
coal usage:ఆధునిక మానవ చరిత్రలో తొలిసారిగా క్రీస్తుపూర్వం 4వేల సంవత్సరంలో చైనాలో బొగ్గును వాడినట్టు రుజువులు లభించాయి. అక్కడ నల్ల లిగ్నైట్ నుంచి ఆభరణాలు తయారుచేశారు. క్రీస్తుపూర్వం 1000 తొలినాళ్లలో ఫుషున్ గని నుంచి తీసిన బొగ్గుతో రాగిని కరిగించేవారు.
- coal history: ఐరోపాలో బొగ్గు వాడకానికి సంబంధించిన తొలి ప్రస్తావన గ్రీక్ శాస్త్రవేత్త థియోఫ్రేస్టస్ రాసిన ఆన్ స్టోన్స్‌లో కనిపిస్తుంది.
- 13వ శతాబ్దంలో చైనాలో పర్యటించిన మార్కో పోలో బొగ్గును నల్లటి రాళ్లుగా, మండే కట్టెలుగా అభివర్ణించారు.
- ఇంగ్లండులో రోమన్లు రెండో, మూడో శతాబ్దాల్లోనే బొగ్గును వాడుకున్నట్టు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. కర్ర బొగ్గు కన్నా భూమిలోంచి వెలికితీసిన బొగ్గు మరింత ఎక్కువ వేడిగా ఉంటున్నట్టు, తక్కువ పొగను వెలువరిస్తున్నట్టు 1700ల్లో గుర్తించారు.
- ఉత్తర అమెరికాలో హోపీ ఇండియన్స్ వంటకు, వేడికే కాదు.. మట్టితో కుండలు తయారుచేయటానికీ బొగ్గును వాడుకున్నారు.
- ఇళ్లను వెచ్చగా ఉంచుకోవటానికి బొగ్గును ఉపయోగించటం 1800ల్లో మొదలైంది. రెండో శతాబ్దం చివరికి ఇంగ్లండ్, వేల్స్‌లోని అన్ని భారీ బొగ్గు క్షేత్రాల నుంచి రోమన్లు బొగ్గును వెలికితీయటం ఆరంభించారు. అనంతరం బొగ్గు వాణిజ్య వస్తువుగానూ మారింది.
- జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనటంతో మనుషులు, జంతువులతో చేసే పనులను యంత్రాలతో చేయటం సాధ్యమైంది. బొగ్గుతో నీటిని వేడి చేసి, దాన్నుంచి పుట్టుకొచ్చే ఆవిరితో వాట్ తన యంత్రాలను నడిపించారు.
- 19వ శతాబ్దం తొలి అర్ధభాగంలో పారిశ్రామిక విప్లవం శరవేగంగా విస్తరించింది. ఇందులో బొగ్గు చాలా కీలక పాత్ర పోషించింది. ఆవిరితో నడిచే రైళ్లు, ఓడలు ప్రధాన రవాణా సాధనాలుగా మారిపోయాయి. వీటిల్లో బాయిలర్లకు ఇంధనంగా బొగ్గునే వాడేవారు.
- 19వ శతాబ్దం రెండో అర్ధభాగంలో బొగ్గు వాడకం మరింత విస్తృతమైంది. ఆయుధ ఫ్యాక్టరీలు సైతం దీనికే మొగ్గుచూపాయి.
- 1875 వచ్చేసరికి బొగ్గుతో కోక్‌ను తయారుచేశారు. స్టీలు తయారీకి ఐరన్ బ్లాస్ట్ ఫర్నేస్‌లలో కర్రబొగ్గుకు బదులు దీన్నే వాడుకోవటం ఆరంభించారు.
- 1880ల్లో బొగ్గును విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవటం మొదలెట్టారు. చివరికిదే విద్యుత్తు ఉత్పత్తిలో ఇదే ప్రధాన ఇంధనంగా మారింది. ప్రస్తుతం విద్యుత్తు ఉత్పత్తి కోసమే బొగ్గును ఎక్కువగా వాడుకుంటున్నాం.
coal energy resources:బొగ్గు శుద్ధ ఇంధనమేమీ కాదు. ఇందులో సల్ఫర్, నైట్రోజన్ వంటి మాలిన్యాలు ఉంటాయి. బొగ్గు మండినప్పుడు ఇవి గాలిలోకి విడుదలవుతాయి. గాలిలో తేలుతున్నప్పుడు నీటి ఆవిరితో కలిసి బిందువులుగా మారి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం రూపంలో భూమి మీద పడతాయి. 'ఆమ్ల వర్షం' అంటే ఇదే. స్వల్ప మోతాదులో ఉండే మట్టి, ఇతర ఖనిజాలు బొగ్గుతో పాటు మండవు. ఇవి బూడిద రూపంలో మిగిలిపోతాయి. కొన్ని సూక్ష్మ రేణువులు వాయువుల రూపంలో వెలువడి పొగగా మారతాయి. బొగ్గు మండినప్పుడు దీనిలోని కర్బనం ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డయాక్సైడ్‌గా ఏర్పడుతుంది. రంగు, వాసన లేని ఇది భూమి వాతావరణంలో వేడిని పట్టి ఉంచుతుంది. దీంతో భూమి ఉష్ణోగ్రత పెరుగుతోందని, వాతావరణ మార్పు సంభవిస్తోందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అందుకే దీనిలోని కాలుష్య కారకాలు గాలిలో కలవక ముందే సంగ్రహించటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. బొగ్గును చిన్న ముక్కలుగా చేసి, శుభ్రంగా కడగటం వీటిల్లో ఒక పద్ధతి. విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే పొగలోని సల్ఫర్ డయాక్సైడ్‌ను స్క్రబర్స్ ద్వారా తొలగించటం మరో పద్ధతి. ఇందులో సున్నపురాయిని నీటితో కలిపి పొగ మీద చల్లుతారు. ఇది సల్ఫర్‌ను గ్రహిస్తుంది. ఇప్పుడు సున్నపురాయిని పొడి రూపంలోనూ పొగ మీద చల్లుతున్నారు.
శక్తి సాంద్రత:బొగ్గు శక్తి సాంద్రత సుమారు ప్రతి కిలోకు 24 మెగాజౌల్స్ (దాదాపు ప్రతి కిలోకు 6.7 కిలోవాట్-అవర్స్). నలబై శాతం సామర్థ్యం గల ఒక బొగ్గు విద్యుత్ కేంద్రం 325 కిలోల బొగ్గుతో 100 వాట్ల బల్బు ఏడాది పాటు వెలగటానికి అవసరమైన విద్యుత్తును తయారుచేయగలదని అంచనా. ప్రపంచం మొత్తం వినియోగించుకుంటున్న శక్తిలో దాదాపు 28% బొగ్గు నుంచే లభిస్తోంది. ఇందులో ఆసియా దేశాలే సుమారు మూడొంతులను వాడుకుంటున్నాయి.
లోతును బట్టి తవ్వకం:
డీప్ మైనింగ్:ఒకవేళ బొగ్గు భూమిలో చాలా లోతుల్లో ఉంటే అక్కడి వరకూ సొరంగాలు (మైన్ షాఫ్ట్స్) తవ్వుతారు. తర్వాత యంత్రాలతో బొగ్గును తవ్వి పైకి తీసుకొస్తారు. కొన్ని సొరంగాలు వెయ్యి అడుగుల లోతు వరకూ ఉంటాయి. దీన్ని డీప్ మైనింగ్ లేదా అండర్‌గ్రౌండ్ మైనింగ్ అని పిలుచుకుంటారు. గనుల్లోంచి బొగ్గును చిన్న పెట్టెల్లో లేదా కన్వేయర్ బెల్టులో నింపి పైకి తీసుకొస్తారు. పెద్ద బొగ్గు ముద్దలను చిన్న చిన్న ముక్కలుగా చేసి రవాణా చేస్తారు.
పైప్‌లైన్ ద్వారానూ:బొగ్గును పైప్‌లైన్ ద్వారా కూడా సరఫరా చేస్తారు తెలుసా? చిన్న ముక్కలుగా చేసిన బొగ్గును నూనె లేదా నీటితో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని స్లర్రీ అంటారు. దీన్ని పైప్‌లైన్ ద్వారా పరిశ్రమలకు చేరవేస్తారు.