అంతరిక్షమంటే మనిషికి మొదట్నుంచీ ఆసక్తే. విశ్వాంతరాళాన్ని శోధించాలని, గ్రహాంతర యానం చేయాలని ఎప్పుడూ ఉబలాటమే. ఇందుకోసం ఎంతో సాధన సంపత్తిని సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అయితే వీటిల్లో కొన్ని మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం..
మౌస్ మ్యాజిక్..
మౌస్ లేకపోతే డెస్క్‌టాప్‌తో పనిచేయటం చాలా కష్టం. అన్నిసార్లూ అందరికీ కీబోర్డుతోనే పనిచేయటం రాదుగా మరి. మొదట్లో దీన్ని వ్యోమనౌకల నియంత్రణ, సిమ్యులేషన్‌ను సులభం చేయటానికే రూపొందించారు. స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డౌ ఎంజెల్‌బార్ట్ దీన్ని తయారుచేసినప్పటికీ.. నిధులు అందించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసానే. చిన్న చెక్కను నున్నటి ఉపరితలం మీద నొక్కినప్పుడు అడుగున ఉండే చక్రాలు కదిలేలా మొదటిసారి మౌస్‌ను తయారుచేశారు. దీంతో కంప్యూటర్ తెర మీద కర్సర్ కదిలేది. ఎంజెల్‌బార్ట్ దీన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో 1968లో జరిగిన కంప్యూటర్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. అప్పట్నుంచీ రకరకాలుగా మార్పు చెందుతూ.. చివరికి లేజర్ ట్రాకింగ్‌తో కూడిన అధునాతన మౌస్‌గా అభివృద్ధి చెందింది.
సెల్ఫీ సైన్స్..
ఇప్పుడు కెమెరాలేని మొబైల్ ఫోన్‌ను ఊహించుకోవటమే కష్టం. అమెరికా భౌతికశాస్త్రవేత్త ఎరిక్ ఫోజమ్ సృష్టించిన పిక్సెల్ ఇమేజ్ గ్రాహకమే నేటి అధునాతన స్మార్ట్‌ఫోన్ కెమెరా, వెబ్‌క్యామ్స్‌కు బీజం వేసింది. అంతరిక్షంలో గ్రహ యానానికి సరిపడిన చిన్న కెమెరాను తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఫోజమ్ దీన్ని రూపొందించారు. అయితే ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుండటంతో అనతికాలంలోనే చాలా పలు పరిశ్రమలు వినియోగించటం ఆరంభించాయి. క్రమంగా ఫోన్ కెమెరాగానూ మారిపోయింది. ఫోజమ్ సృష్టించిన పిక్సెల్ ఇమేజ్ గ్రాహకం కలర్ ఫిల్టర్లు, కాంతిని విద్యుత్‌శక్తిగా మార్చే ఫొటోడయోడ్ సాయంతో పనిచేస్తుంది. గ్రాహకం మీదుగా కాంతి ప్రసరిస్తున్నప్పుడు.. దాన్ని గ్రాహకం స్వీకరించి, విద్యుత్ సంకేతంగా మారుస్తుంది. తర్వాత వివిధ ట్రాన్సిస్టర్లు ఈ విద్యుత్ సంకేతాలను మెరుగుపరుస్తాయి. అనంతరం అవన్నీ ఫొటోగా రూపాంతరం చెందుతాయి.
వాటర్ ఫిల్టర్..
నిజానికి ప్రాథమిక స్థాయి వాటర్ ఫిల్టర్లు 50ల నుంచే వాడకంలో ఉన్నాయి. అయితే అపోలో ఉపగ్రహ కార్యక్రమం పరిశోధనతోనే ఆధునిక వాటర్ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చింది. విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ పెద్దమొత్తంలో నీరు ఎక్కువకాలం శుభ్రంగా ఉంచేందుకే శాస్త్రవేత్తలు దీన్ని నిర్మించారు. బొగ్గుకు కాలుష్యాలను, నుసిని స్వీకరించే గుణముంది. దీని ఆధారంగానే ప్రత్యేక నీటి వడపోత వ్యవస్థను రూపొందించారు. ఇదో ఆక్సీకరణ ప్రక్రియ. ఇది కర్బన అణువుల మధ్య లక్షలాది రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. దీంతో బొగ్గు మరింత ఎక్కువగా కలుషితాలను స్వీకరిస్తుంది. ఇదే క్రమంగా మారుతూ నేటి వాటర్ ఫిల్టర్ల ఆవిష్కరణకు దారితీసింది.
శాటిలైట్ టెలివిజన్..