Free Antivirus Tools : ఈ డిజిటల్ యుగంలో సైబర్ దాడులు సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా యూజర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యునికేషన్ (డాట్) అనేక ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ కూడా పంపిస్తోంది.
ఉచితంగా యాంటీ వైరస్‌లను డౌన్లోడ్ చేసుకునేందుకు www.csk.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి సెక్యూరిటీ టూల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో మైక్రోసాఫ్ట్ విండోస్ కంప్యూటర్లతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్లకు సీఎస్కే అందిస్తున్న వివిధ కంపెనీల యాంటీ వైరస్ డౌన్లోడ్ లింక్‌లు కనిపిస్తాయి.
సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్
కేంద్ర ప్రభుత్వం సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ (Cyber Swachhta Kendra Portal) ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా మాల్వేర్ డిటెక్షన్ టూల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ పోర్టల్‌ను 'బాట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలసిస్ సెంటర్' అని కూడా అంటారు. ఇది కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ నేతృత్వంలో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో, యాంటీ వైరస్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత యాంటీ వైరస్ల సహాయంతో యూజర్లు తమ సెల్‌ఫోన్, కంప్యూటర్ డివైజ్‌లను మాల్వేర్స్ నుంచి రక్షించుకోవచ్చు.
బాట్నెట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
మాల్వేర్ సోకిన స్మార్ట్ఫోన్లు లేదా కంప్యూటర్ల లాంటి డివైజ్‌ల నెట్‌వర్క్‌నే 'బాట్' అంటారు. ఒకసారి ఒక కంప్యూటర్‌కి మాల్వేర్ సోకి, అది బాట్‌నెట్‌కు అనుసంధానం అయిపోతే.. ఇక అప్పటి నుంచి ఆ కంప్యూటర్లోని సమాచారం మొత్తాన్ని మాల్వేర్.. హ్యాకర్స్‌కు అందిస్తూ ఉంటుంది. మాల్వేర్ ఎటాక్ జరిగిన తరువాత, హ్యాకర్లు.. మన డివైజ్‌లకు స్పామ్ మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. అలాగే మన ఫోన్ల నుంచి వెళ్లే కాల్స్‌ను, మెసేజ్‌లను బ్లాక్ చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా చాలా సున్నితమైన సమాచారాలను సైతం, అంటే మన నెట్ బ్యాంకింగ్ వివరాలను, యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్‌ను కూడా తెలుసుకోగలుగుతారు.