విశ్వంలోని ఒక పురాతన భారీ కృష్ణబిలం సాగిస్తున్న 'ఆరగింపు'ను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రమంలో దాని నుంచి వెలువడుతున్న అత్యంత బలమైన జ్వాలను గుర్తించారు. వీటిపై విశ్లేషణ ద్వారా కృష్ణబిలం వివరాలను తెలుసుకోవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ శనివారం తెలిపింది. విశ్వంలోని అంతుచిక్కని అంశాల గుట్టు విప్పడానికి వీలు కలుగుతుందని వివరించింది. సుదూర గెలాక్సీల మధ్య భాగంలో ఉన్న అత్యంత భారీ కృష్ణబిలాలు సమీపంలోని ప్రాంతాల నుంచి పదార్థాలను తమలోకి లాగేసుకుంటాయి. వీటిని 'బ్లేజర్లు' అంటారు.
ఖగోళ శాస్త్రవేత్తలకు ఇవి అత్యంత ఆసక్తికరమైన అంశాలు. ఎందుకంటే ఇవి దాదాపు కాంతి వేగంతో ఆవేశిత రేణువుల ధారలను జ్వాలల రూపంలో వెదజల్లుతుంటాయి. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన, శక్తివంతమైన పరిణామాల్లో ఇవి కూడా ఒకటి. తాజాగా.. భూమికి కోటి కాంతి సంవత్సరాల దూరంలో బీఎల్ లాస్రేట్ అనే బ్లేజర్‌ను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్నపాటి టెలిస్కోపుతో గమనించిన ముఖ్యమైన 50 బ్లేజర్లలో ఇది కూడా ఒకటి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఆద్వర్యంలోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్(ఏరీస్)కు చెందిన అలోక్ చంద్ర గుప్త నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని గుర్తించింది.