వాట్సాప్ కొత్త నిబంధనలపై భారత ప్రభుత్వం స్పందించింది. వ్యక్తిగత గోప్యత ప్రమాణాల విషయంలో ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యం కాదని వాట్సాప్కు సూచించింది. నిబంధనల్లో మార్పులను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్కు తెలిపింది. మార్పుల విషయాన్ని పునరాలోచించాలని పేర్కొంది.
ఈ మేరకు వాట్సాప్ సీఈఓకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 'వాట్సాప్కు అత్యధిక యూజర్ బేస్ ఉన్న దేశం భారత్. వాట్సాప్కు అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి' అనే విషయాన్ని లేఖలో గుర్తు చేసింది.
వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సేవా నిబంధనలు, గోప్యతా ప్రమాణాల్లో మార్పులతో.. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వాట్సాప్కు లేఖ రాయడం గమనార్హం.