IOT Malware Attacks : సాంకేతికతలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)ను విప్లవాత్మమైనదిగా అభివర్ణిస్తుంటారు. మనిషి అవసరంలేకుండా ఐఓటీ సాయంతో ఎన్నో రకాల పనులు చక్కబెట్టేయొచ్చు. ఇంతటి గొప్ప సాంకేతికతను సైతం మాల్‌వేర్ భయాలు వెంటాడుతున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఐఓటీ డివైజ్‌లపై మాల్‌వేర్ దాడి ఎక్కువగా జరిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి.
ETV Bharat / science-and-technology
ఐఓటీని వదలని మాల్‌వేర్ భయాలు.. మైక్రోసాఫ్ట్ పరిశోధనలో వెల్లడి.. - ఐఓటీ డివైజ్‌లలో మాల్‌వేర్ వ్యాప్తి
IOT Malware Attacks : 2022లో వివిధ దేశాల్లో జరిగిన మాల్‌వేర్ దాడులపై మైక్రోసాప్ట్ బృందం పరిశోధన నిర్వహించింది. ఇందులో ఈ ఏడాది మాల్‌వేర్ దాడికి గురైన వాటిలో ఐఓటీ డివైజ్‌లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
2022లో వివిధ దేశాల్లో జరిగిన మాల్‌వేర్ దాడులపై మైక్రోసాప్ట్ బృందం పరిశోధన నిర్వహించింది. ఇందులో ఈ ఏడాది మాల్‌వేర్ దాడికి గురైన వాటిలో ఐఓటీ డివైజ్‌లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఐఓటీ డివైజ్‌లలో మాల్‌వేర్ వ్యాప్తి చైనాలో 38 శాతం ఉండగా, అమెరికాలో 18 శాతం ఉంది. ఇక భారత్‌లో 10 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మాల్‌వేర్‌ను ఎక్కువగా ఐటీ పరికరాలు, ఆపరేషనల్ టెక్నాలజీ కంట్రోలర్స్, రౌటర్స్, కెమెరాలు వంటి డివైజ్‌లలో గుర్తించినట్లు వెల్లడించింది. అధికశాతం ఐటీ కంపెనీలు ఐఓటీ సాంకేతికతను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ డివైజ్‌ల సైబర్ భద్రతపై మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఒకవేళ ఈ సాంకేతికతపై మాల్‌వేర్ దాడులు పెరిగితే ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ఇంటర్వ్యూల్లో ఐఓటీ సాంకేతికతతో డీప్ ఫేక్ పద్ధతి ద్వారా ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తితో ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలానే మనిషి గుండెలో అమర్చే పేస్‌మేకర్‌ను ఐఓటీ పరిజ్ఞానంతో కంప్యూటర్లకు అనుసంధానం చేసి సదరు వ్యక్తికి హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. ఆటోమెటిక్ కార్లను సైబర్ నేరగాళ్లు ఐఓటీ మాల్‌వేర్ సాయంతో హ్యాక్ చేసి కారు వేగాన్ని పెంచే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు అభిప్రాపడుతున్నారు. ఈ సాంకేతికత సాయంతో విద్యార్థులు పాఠశాల సర్వర్లు హ్యాక్ చేసి మార్కులు మార్చుకోవచ్చని ఆందళోన వ్యక్తం చేస్తున్నారు.