ఐఐటీలంటేనే సాంకేతిక భాండాగారాలు. నిరంతర పరిశోధనల నిలయాలు. కొంగొత్త ఆవిష్కరణల పుట్టిళ్లు. ఒకటి కాదు, రెండు కాదు.. దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఒకేచోట కలిస్తే? తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తే? అది నిజంగా శాస్త్ర, సాంకేతిక మేళానే. ఐఐటీ దిల్లీ ప్రాంగణంలో ఇటీవల అలాంటి వేడుకే జరిగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ఈ సంబరంలో ఐఐటీల ఆవిష్కరణలెన్నో ప్రదర్శితమయ్యాయి. వాటిల్లో కొన్నింటి విశేషాలు ఇవీ..
అంధుల కోసం ప్రత్యేక వాచ్
రోజువారీ పనుల్లో సమయం ఎంత కీలకమో తెలిసిందే. చేతి వాచ్‌ను చూసి టైమెంతో ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ కళ్లు కనిపించనివారికి? కష్టమే కదా. చూపు కోల్పోయినవారి కోసమూ టాక్టయిల్, వైబ్రేషన్, సౌండ్, బ్రెయిలీ వాచ్‌లు ఉన్నాయి. అయితే వీటితో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. టాక్టయిల్ వాచ్‌లను వేలితో తాకినప్పుడు ముళ్లు విరిగిపోవచ్చు. వైబ్రేషన్ వాచ్‌ల్లో రకరకాల కంపనాలతో టైమ్ సరిగా తెలియకపోవచ్చు. సౌండ్‌తో టైమ్‌ను చెప్పే వాచ్‌లు గోప్యతకు భంగం కలిగించొచ్చు. బ్రెయిలీ వాచ్‌లు సౌకర్యంగానే ఉంటాయి గానీ ఖరీదు ఎక్కువ. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వినూత్నమైన టాక్‌వైబ్స్ వాచ్‌ను రూపొందించారు.
ఇది స్పర్శ, కంపనాలు రెండింటి సాయంతో సమయాన్ని తెలియజేస్తుంది. దీని చుట్టూరా గంటలను తెలిపే చోట సెన్సిటివ్ మార్కర్లుంటాయి. వేలితో తాకినప్పుడు అప్పటి సమయానికి అనుగుణంగా కంపించి, సమయాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు- 12 గంటల 30 నిమిషాలు అయ్యిందనుకోండి. 12 గంటల గుర్తు వద్ద తాకినప్పుడు అది కాస్త ఎక్కువసేపు కంపిస్తుంది. అలాగే వేలిని ముందుకు తీసుకొస్తూ ఉంటే 6 గంటల దగ్గర కాస్త తక్కువసేపు కంపిస్తుంది. అప్పుడు 12.30 అయ్యిందని తెలుస్తుందన్నమాట. నిమిషాల వారీగా సమయాన్ని తెలుసుకునే సదుపాయమూ ఇందులో ఉంటుంది. తేలికగా వాడుకునేలా, గోప్యతకు భంగం కలిగించని విధంగా, చవకగా అందుబాటులో ఉండేలా చూడటం దీని ఉద్దేశం. దీన్ని రూ.1,500కు అందించాలని భావిస్తున్నారు. చూపులేనివారికి ఈ వాచ్‌ను అమర్చి పరీక్షించారు కూడా. అంతా సంతృప్తి వ్యక్తం చేయటం విశేషం.
రోబో చేతి చట్రం
పక్షవాతం తీవ్ర సమస్య. శరీరంలో ఒకవైపు భాగాన్ని చచ్చుబడేలా చేస్తుంది. సరైన ఫిజియోథెరపీ తీసుకుంటే తిరిగి అవయవాలు స్వాధీనంలోకి వచ్చే అవకాశముంది. నిపుణులు అవయవాలను కదిలిస్తుంటే దానికి అనుగుణంగా మెదడులో అనుసంధానాలు ఏర్పడతాయి. ఇవి తిరిగి కదలికలు అబ్బటానికి తోడ్పడతాయి. అయితే అన్నిసార్లూ ఫిజియోథెరపీ నిపుణులు అందుబాటులో లేకపోవచ్చు. ఉన్నా కూడా ఎక్కువసేపు వ్యాయామాలు చేయించలేకపోవచ్చు. ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటే మెదడులో అనుసంధానాలు సరిగా ఏర్పడవు కూడా.
ఐఐటీ కాన్పూర్ రూపొందించిన రోబో చేతి చట్రంతో మాత్రం వేళ్ల కదలికలను తేలికగా తిరిగి పొందొచ్చు. పక్షవాతం బాధితుల కోసం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ) ఆధారంగా రూపొందించారు దీన్ని చచ్చుబడిన చేతికి పైన తగిలించుకుంటే చాలు. వేళ్లు సహజంగా కదిలినట్టుగానే కదిలిస్తూ తర్ఫీదు ఇస్తుంది. ఆయా కదలికలకు సంబంధించి మెదడులో అనుసంధానాలు ఏర్పడేలా చేస్తుంది. పక్షవాతం బాధితులపై ప్రయోగ పరీక్షలు నిర్వహించగా పిడికిలి బిగువు, పనులు మెరుగుపడినట్టు బయటపడింది. దీంతో చికిత్స తీసుకున్నాక అందరిలోనూ చేతి పనులు పూర్తిగా తిరిగి రావటం గమనార్హం.
నావిగేషన్ చిప్ ధ్రువ
ఇప్పుడు లొకేషన్ సేవలు జీవితంలో ఒక భాగంగా మారి పోయాయి. వీటి సాయంతో మొబైల్ ఫోన్ల ద్వారా ఆయా చోట్లను తేలికగా గుర్తిస్తున్నాం, వెళ్లగలుగుతున్నాం కూడా. ఈ సేవల్లో అత్యంత ఆదరణ పొందింది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్). అమెరికా ప్రభుత్వం ఆధీనంలోని దీన్ని అన్నిసార్లు నమ్మటానికి లేదు. కార్గిల్ యుద్ధ సమయంలో మన సైన్యం వాడుకోవటానికి అంగీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనదేశం నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కమ్యూనికేషన్స్) అనే నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను రూపొందించింది. కానీ నావిక్ అన్ని బ్యాండ్లను గ్రహించే రిసీవర్ లేకపోవటం వల్ల మొబైల్ సంస్థలేవీ దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీన్ని పరిష్కరించటానికి ఐఐటీ బాంబే ధ్రువ అనే ఆర్‌ఎఫ్ రిసీవర్‌ను తయారుచేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దీన్ని స్మార్ట్‌ఫోన్లు, నావిగేషన్ పరికరాల్లో వాడుకోవచ్చు. నావిగేషన్ ఉపగ్రహాల (నావిక్) నుంచే కాదు, అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థల నుంచి అందే అన్నిరకాల నావిగేషన్ ఫ్రీక్వెన్సీలను ధ్రువ స్వీకరించగలదు.
డిజిటల్ పత్రాల చేతిరాత గుర్తింపు
ఫొటోల్లో, స్కాన్ చేసిన ఇమేజెస్‌లో చేతిరాతను గుర్తించటం అంత తేలికైన పని కాదు. మనదేశంలో ఎన్నెన్నో భాషలు. ఒకే భాషలోనూ ఎన్నో రీతులు. ఆ అక్షరాలను, వాక్యాలను గుర్తించాలంటే మార్పులకు అనుగుణంగా అప్పటికప్పుడు మారిపోయి, నిర్ణయాలు తీసుకునే ఆల్గారిథమ్ అవసరం. అందుకే దీనిపై చాలా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ తిరుపతి శ్రీఅక్షర అనే విభన్నమైన ఆల్గారిథమ్‌ను రూపొందించింది. ప్రాంతీయ భాషల్లోని డిజిటల్ డాక్యుమెంట్లలో అక్షరాలను ఇది తేలికగా గుర్తిచగలదు. ఇందుకోసం పరిశోధకులు ఆయా అక్షరాలను గుర్తించటానికి ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించారు. ఇది ప్రత్యక్షంగా అప్పటికప్పుడు డిజిటల్ పత్రాల్లోని అక్షరాలను గుర్తిస్తుంది. సులభమైన ఈ వ్యవస్థ తనకు తాను కొత్త విషయాలనూ నేర్చుకోగలదు. నాలుగు భాషల అక్షరాలు, పదాలు, అంకెలకు సంబంధించి సుమారు 200 రకాల ఆకారాలను విశ్లేషించగలదు.