ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. తొలుత సాధారణ ఫోన్లతో ప్రారంభమై.. నేడు స్మార్ట్ఫోన్లు, ఐఫోన్ల వరకు విస్తరించింది. ఈ క్రమంలోనే చాలామంది భద్రత విషయంలో రాజీపడకుండా వేలకు వేలు ఫోన్లపై కుమ్మరించి మరీ కొనుక్కుంటారు. వాస్తవానికి భద్రత విషయంలో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తుంది యాపిల్ అయినా.. ఎక్కువమంది కొనుగోలు చేసేది మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్లే. దీనినే ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. దీని కోసం ప్రత్యేక మాల్వేర్ను తయారు చేసి లింక్‌ల రూపంలో ఫోన్లకు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేస్తే మీ సమాచారం సర్వం హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతుంది.
ఆండ్రాయిడ్ యూజర్లే టార్గెట్..
ప్రపంచవ్యాప్తంగా సుమారు 73 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. హ్యాకర్లు వీరినే లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని టెక్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కువగా భద్రతాలోపాలకు గురవుతున్నట్లు నార్డ్ వీపీఎన్ నిపుణులు పేర్కొన్నారు. అయితే వీటిని అధిగమించేందుకు ఆండ్రాయిడ్ తగు చర్యలు చేపట్టినా.. హ్యాకర్లు ఏదో విధంగా దాడికి పాల్పడుతున్నట్లు చెప్తున్నారు.
కొవిడ్‌ను ఆసరాగా చేసుకుని..
కొవిడ్‌ను ఆసరాగా చేసుకుని ఆండ్రాయిడ్ యూజర్లకు లింక్‌లు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇవి టెక్ట్స్ మెసేజ్‌ల రూపంలో వస్తుంటాయి. కొవిడ్‌కు సంబంధించిన బూస్టర్ డోసు లేదా టీకాలు తీసుకునేందుకు షెడ్యూల్ చేసినట్లు ఆ మెసేజ్ సారాంశం ఉంటుంది. దానిని ఆమోదించేందుకు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే 'మీరు అడోబ్ ఫ్లాష్ ప్లేయర్‌ను అప్డేట్ చేసుకోవాలి' అని చూపిస్తుంది. పొరపాటున దానిని అప్డేట్ చేస్తే ట్యాంగిల్బోట్ అనే మాల్వేర్ మీ ఫోన్లోకి ప్రవేశిస్తుంది. అదే జరిగితే మీ ఫోన్ హ్యాకర్ చేతిలోకి వెళ్లినట్లే.