Hyundai Flying Electric Taxi :విద్యుత్‌తో పనిచేస్తూ గాల్లో ఎగిరే ట్యాక్సీ మోడల్‌ను హ్యూందాయ్ మోటార్స్ '2024-కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో ప్రదర్శించింది. నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌నకు చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ 'సూపర్నల్' తయారు చేసింది. నగరంలో రోజువారీ కార్యకలాపాలకు ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. 25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని వివరించింది.
- 'ఎస్-ఏ2' పిలుస్తున్న ఈ ఎగిరే ట్యాక్సీ గంటకు 120 మైళ్ల (~193 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది.
- 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు.
- పైలట్, నలుగురు ప్యాసింజర్లు కూర్చునే వెసులుబాటు ఉంటుంది.
- విద్యుత్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్ ఫీచర్‌తో వస్తున్న ఈ ట్యాక్సీకి ఎనిమిది రోటర్లు ఉంటాయి.
- అతి తక్కువ శబ్దంతో ఇది పనిచేస్తుంది. వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఇది 65 డెసిబుల్స్ శబ్దం చేస్తుంది. గాల్లో ఎగిరే సమయంలో దీన్నుంచి 45 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది.
ఆకట్టుకునే డిజైన్
ట్యాక్సీ డిజైన్ కోసం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ డిజైనర్లతో జట్టుకట్టింది సూపర్నల్. గాల్లో ఎగరడానికి అనుకూలంగా ఉండటం సహా ఆకట్టుకునేలా కనిపించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. భిన్న అభిరుచులు కలిగిన ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త రంగులో నమూనా ట్యాక్సీని రూపొందించినట్లు వివరించింది. ట్యాక్సీలోని పైలట్ సెక్షన్‌కు, ప్యాసింజర్లు కూర్చునే స్థలం మధ్య స్పష్టమైన తేడా కనిపించేలా చూసుకున్నట్లు పేర్కొంది. ఆటోమొబైల్, ఏరో రంగాల కలయికతో రూపొందినట్లు ఉండే ఈ ట్యాక్సీలో విశాలమైన క్యాబిన్ ఉంటుందని పేర్కొంది.