తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గాల్లో ఎగురుతుంది.. ఫొటో క్లిక్​మనిపిస్తుంది! - iit researchers developed kite camera in Hyderabad

విహంగ వీక్షణం ద్వారా ఫొటోలు తీసే అత్యంత తేలికైన సాంకేతిక వ్యవస్థను ట్రిపుల్‌ ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. తక్కువ బరువుతో కూడిన పతంగి కెమెరాను ఆవిష్కరించారు. డ్రోన్‌ కంటే సమర్థంగా పనితీరు కనబరుస్తూ వేలాది చిత్రాలు తీయవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

kite camera, kite camera  by iit researchers
కైట్ కెమెరా, పతంగి కెమెరా

By

Published : May 21, 2021, 1:11 PM IST

ట్రిపుల్‌ ఐటీలోని ప్రాసెస్‌, అర్కిటెక్చర్‌ అండ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌ ఐవోటీ ల్యాబ్‌ ఆచార్యుడు అఫ్తాబ్‌ హుస్సేన్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి అభినవ్‌ నవనీత్‌ నేతృత్వంలోని బృందం పతంగి కెమెరాను ఆవిష్కరించింది. ఇందులో కెమెరా, ప్రాసెసర్‌, బ్యాటరీ ఉంటాయి. 4.65 గ్రాములున్న రెండు అత్యంత తేలికైన లిథియం పాలీమర్‌ బ్యాటరీలతో మొత్తం 42 గ్రాముల బరువుతో కెమెరా, ఇతర సాంకేతిక వ్యవస్థతో కూడిన పరికరాన్ని రూపొందించారు. పతంగికి ఆధారంగా ఉన్న పుల్లకు కెమెరాను అమర్చి వినియోగించేలా డిజైన్‌ చేశారు.

‘‘సాధారణంగా పతంగి 10-15 గ్రాముల బరువులో ఉంటుంది. దీనికి ఏదైనా అమర్చినప్పుడు పైకి ఎగిరేందుకు బలమైన గాలి ప్రవాహం ఉండాలి. సాధారణ గాలి ప్రవాహం ఉన్నప్పుడు 50 గ్రాముల బరువున్న వస్తువులు ఎగిరే వీలుంటుంది. ఇందులో పది గ్రాములు పతంగి బరువు పోగా మిగిలిన 40 గ్రాములతో మా కెమెరా ఉండేలా చూసుకున్నాం’’ అని అఫ్తాబ్‌ హుస్సేన్‌ వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ‘కైట్‌క్యామ్‌- ఎ నావల్‌ అప్రోచ్‌ టు లోకాస్ట్‌ ఏరియల్‌ సర్వైలెన్స్‌’ పేరిట గతేడాది నవంబరులో నిర్వహించిన ఐఈఈఈ సెన్సార్స్‌ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించారు.

తొలిసారే 4,356 ఫొటోలు

ఇప్పటికే ఏరియల్‌ ఫొటోలు తీసేందుకు ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటిని రాడార్లు గుర్తించే వీలుండటంతో రహస్యంగా చిత్రాలు తీయడం సాధ్యం కావడం లేదు. ఈ ఇబ్బందులు అధిగమించేందుకు పతంగి కెమెరా సాయపడుతుంది. ఇది ఎలక్ట్రానిక్‌ పరికరం కాదు కనుక రాడార్లు గుర్తించే వీలుండదు. పూర్తిగా వాయుశక్తి ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల బ్యాటరీ అయిపోతుందన్న ఆందోళన ఉండదు. డ్రోన్స్‌ కంటే ఇది సమర్థంగా చేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. మొదటిసారి పతంగి కెమెరాను ప్రయోగించినప్పుడు 35 నిమిషాలు గాల్లో ఎగిరి ఏకంగా 4,356 చిత్రాలు తీసింది. గాలి ప్రవాహ వేగం, కెమెరా పనితీరు ఆధారంగా ఒక్కసారి ఎగిరితే ఆరు గంటల పాటు పనిచేసే వీలున్నట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details