ఈ సువిశాల విశ్వంలో మనం ఏకాకులమా? మనలాంటి జీవులు మరేదైనా గ్రహంలో ఉన్నాయా? శతాబ్దాలుగా మానవులను వేధిస్తున్న ప్రశ్న ఇది. అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తన పనిని మొదలుపెట్టిన నేపథ్యంలో.. ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. సౌర కుటుంబం వెలుపలి గ్రహాల గురించి అధ్యయనం చేసి, అక్కడ ఎలాంటి వాయువులు ఉన్నాయన్నది తేల్చడం ఈ టెలిస్కోపునకు నిర్దేశించిన నాలుగు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మనకు తెలిసినంతవరకూ జంతువులు మనుగడ సాగించాలంటే ఆక్సిజన్ అవసరం. అందువల్ల ఈ వాయువు ఉనికి ఆధారంగా ఇతర గ్రహాల్లో జీవం ఆచూకీపై ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో పుడమి చరిత్రలో కాలానుగుణంగా ఆక్సిజన్ పరిమాణాల్లో వచ్చిన మార్పులపై బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాగించిన ఒక పరిశోధన.. గ్రహాంతరజీవం అన్వేషణకు మార్గదర్శిగా నిలిచింది.
జీవం, ఆక్సిజన్..
ప్రస్తుతం భూ వాతావరణంలో ఆక్సిజన్ వాటా 21 శాతం ఉంది. అయితే పుడమి చరిత్రలో చాలాకాలం పాటు ఈ వాయువు ఇంత పుష్కలంగా లేదు. ఉన్నపళంగా మనం కాలంలో 45 కోట్ల ఏళ్లు వెనక్కి వెళితే.. వీపులపై ఆక్సిజన్ ట్యాంకులు లేనిదే మనుగడ సాగించలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉండేది. అయితే కాలానుగుణంగా ఆక్సిజన్ పరిమాణాల్లో వచ్చిన మార్పులపై శాస్త్రవేత్తలకు ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ వాయువు పెరిగినప్పుడు జంతువుల పరిణామక్రమానికి ఊతం లభించి, కొరత ఏర్పడినప్పుడు అందుకు విరుద్ధంగా జరిగిందా అన్నది తీవ్ర చర్చనీయాంశమైంది.
వ్యాప్తిలో ఉన్న సిద్ధాంతమిదీ..
ప్రస్తుతమున్న సిద్ధాంతం ప్రకారం భూమిపై ఆక్సిజన్ స్థాయి మూడు అంచెల్లో పెరిగింది. ఇందులో మొదటిది.. 'గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్'. ఇది 240 కోట్ల ఏళ్ల కిందట జరిగిందని భావిస్తున్నారు. దానికి ముందు వాతావరణం, సముద్రాల్లో ఆక్సిజన్ ఉండేది కాదు.. గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌తో పుడమిపై ఈ వాయువు శాశ్వతంగా పాగా వేసింది.
- మూడో పరిణామం.. 42 కోట్ల ఏళ్ల కిందట జరిగింది. దీన్ని 'పేలియోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్'గా పిలుస్తారు. దీనివల్ల వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం ప్రస్తుత స్థాయికి చేరింది.
- ఈ రెండు ఘటనలకు మధ్య 80 కోట్ల ఏళ్ల కిందట నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ (ఎన్‌వోఈ) ఘటన జరిగింది. అది ఆక్సిజన్ పెరుగుదలకు ఊతమిచ్చింది.
- తొలితరం క్షీరదాలు పుట్టుకురావడానికి ముందు (60 కోట్ల ఏళ్ల కిందట) ఎన్‌వోఈ చోటుచేసుకున్నట్లు మరికొన్ని పరిశోధనలు సూత్రీకరించాయి.
కంప్యూటర్ మోడల్‌తో..
తాజాగా ఎన్‌వోఈ కాలంలో వాతావరణంలోని ఆక్సిజన్ స్థాయిని పునర్‌నిర్మించడానికి లీడ్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లో తొలితరం జంతువులు పుట్టుకొచ్చాయన్నది తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వారు భూమికి సంబంధించిన ఒక కంప్యూటర్ మోడల్‌ను నిర్మించారు. వాతావరణంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేసే లేదా తొలగించే వివిధ ప్రక్రియలను అందులోకి చొప్పించారు. కార్బన్ ఐసోటోపులు కలిగిన శిలలను శోధించారు. తద్వారా ఆయా కాలాల్లో జరిగిన కిరణజన్యసంయోగ క్రియ స్థాయిని లెక్కించారు. మొక్కలు శక్తిని తయారుచేసుకోవడానికి వినియోగించే ఈ విధానమే.. పుడమిపై ఆక్సిజన్‌కు ప్రధాన వనరు.