How To Secure Your Google Pay Account :భారతదేశంలోని టాప్-5 యూపీఐ పేమెంట్ యాప్స్‌లో 'గూగుల్ పే' ఒకటి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ప్రపంచంలో గూగుల్ పే యాప్‌కు ఉన్న బిగ్గెస్ట్ మార్కెట్లలో భారత్ అతి ప్రధానమైనది. అందుకే గూగుల్ ప్రస్తుతం తమ యూజర్లకు ఒక అలర్ట్ పంపించింది. కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ సహా, థర్డ్ పార్టీ యాప్‌లను.. మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఉపయోగించవద్దని సూచిస్తోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
గూగుల్ పే తమ యూజర్ల భద్రత కోసం, ఆన్లైన్ మోసాలను నివారించడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా రియల్-టైమ్‌లో జరిగే అనుమానిత ఆర్థిక లావాదేవీలను గుర్తించగలుగుతోంది. అయితే కొంత మంది యూజర్లు గూగుల్ పే ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని గూగుల్ హెచ్చరిస్తోంది.
ఆ యాప్స్‌తో జాగ్రత్త!
Most Dangerous Screen Sharing Apps : ఉదాహరణకు Screen Share, AnyDesk, TeamViewer లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. వీటిని ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్లలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్స్ రిమోట్ ఏరియా నుంచి మీ డివైజ్‌లను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్టర్స్ చేతిలోకి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను చేరుస్తాయి. కనుక ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఈ స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని గూగుల్ హెచ్చరిస్తోంది. వీలైతే వాటిని ఫోన్ నుంచి అన్-ఇన్స్టాల్ చేయాలని.. లేదంటే పూర్తిగా డిలీట్ చేసేయాలని సూచిస్తోంది.
థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు!
Most Dangerous Third Party Apps : కొంత మంది యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదు. కొన్ని సార్లు సైబర్ నేరగాళ్లు.. తాము గూగుల్ పే ప్రతినిధులమని చెప్పుకుంటూ.. తాము సూచించిన థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. గూగుల్ పే మాత్రమే కాదు.. ఏ పేమెంట్ యాప్ కూడా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోమని చెప్పదు. కనుక ఇలాంటి బోగస్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే గూగుల్ పే హెల్ప్‌లైన్ సహకారం తీసుకోవాలి. ఇంకా అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.