Spam Messages In Mail : ఈ-మెయిల్‌తో ప్రయోజనాలు ఎన్నో. కాకపోతే స్పామ్ మెయిళ్లతోనే చిక్కు. సబ్‌స్క్రయిబ్ చేసుకోకపోయినా వివిధ వ్యాపార సంస్థల నుంచి టపాలు వచ్చి పడుతుంటాయి. ఇవి చికాకు కలిగించటమే కాదు, ముఖ్యమైన మెయిళ్లు కిందికి పోయేలా చేస్తాయి. ఇలాంటి అవాంఛిత మెయిళ్లను ఒకోటీ తొలగించుకోవటం పెద్ద ప్రహసనం. జీమెయిల్‌లో వీటిని తేలికగా ఎలా వదిలించుకోవాలో చూద్దాం.
- జీమెయిల్‌లోకి లాగిన్ కావాలి. స్పామ్ మెయిల్ విభాగంలోకి వెళ్లి అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకునే వాటిని ఎంచుకోవాలి.
- పైన కనిపించే 'ఐ' బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు 'రిపోర్ట్ స్పామ్ లేదా రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌సబ్‌స్క్రయిబ్' ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఐడీల జాబితాలను పరిశీలించి, ముఖ్యమైనవేవీ లేవని భావిస్తే ‘రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌స్క్రయిబ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే ఆయా ఖాతాల నుంచి మెయిళ్లు రావటం ఆగిపోతుంది.
ఫిల్టర్ల సృష్టి
- జీమెయిల్‌ను ఓపెన్ చేసి, పైన సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. అన్‌సబ్‌స్క్రయిబ్ అని టైప్ చేయాలి. దీంతో అన్ని ప్రమోషనల్ మెయిళ్ల జాబితా కనిపిస్తుంది.
- అన్ని స్పామ్ మెయిళ్లను ఎంచుకోవాలి. వీటి జాబితాలో ఉపయోగపడే న్యూస్‌లెటర్లు లేదా వాడుకునే మెయిళ్ల వంటివేవీ లేకుండా చూసుకోవాలి.
- తర్వాత పైన కనిపించే మూడు చుక్కల మీద నొక్కి, 'ఫిల్టర్ మెసేజెస్ లైక్ దీస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం 'క్రియేట్ ఫిల్టర్' ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అవి వాటంతటవే డిలీట్ కావాలనుకుంటే క్రియేట్ ఫిల్టర్ మీద నొక్కి 'డిలీట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు ఫిల్టర్ క్రియేట్ అయినట్టు కింద ఒక పాపప్ కనిపిస్తుంది. వీటిని డిలీట్ చేసుకోవటమే కాదు, లేబుల్స్ అప్లయి చేయటం ద్వారా అవసరమైనట్టుగానూ విభజించుకోవచ్చు.