Computer Virus Prevention Tips : పీసీ వాడేవారి నోట అప్పుడప్పుడు వినే పదం వైరస్. ఎప్పుటికప్పుడు వీటితో సతమతమవతూనే ఉంటారు. ఈ కంప్యూటర్ వైరస్ మన ప్రమేయం లేకుండానే పీసీలో ఇన్‌స్టాల్ అయ్యి రకారకాల హానికర పనులు చేస్తుంది. ఒక్కోసారి మొత్తం పీసీ పనితీరునే మార్చేస్తుంది. అయితే కంప్యూటర్‌కు వైరస్ సోకిందని మనం తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించటానికి ఏవైనా లక్షణాలు ఉంటాయా? ఓ సారి ఈ విషయాలు తెలుసుకుందాం.
కంప్యూటర్ వైరస్‌ల బెడద ఈనాటిది కాదు. 50 ఏళ్ల కిందటే మొదలైంది. మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ పేరు క్రీపర్ వామ్. ఇది 1971లో పుట్టుకొచ్చింది. ఇదేమీ హాని చేయలేదు గానీ బాగా చిరాకు పెట్టింది. అర్పానెట్ అంతటా ప్రయాణిస్తూ 'పట్టుకోండి' అనే సందేశం వదిలి పెట్టేది. అలా మొదలైన కంప్యూటర్ వైరస్ ప్రస్థానం అనంతంగా సాగుతూనే వస్తోంది. ఇవి రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతూనే వస్తున్నాయి. తీవ్ర నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. మనం ఇన్‌స్టాల్ చేసుకోకపోయినా పీసీలో చొరబడేదే అయినా ఇందులో మన ప్రమేయం అసలే లేదనుకోవటానికి లేదు. ఈ-మెయిల్ లింకును నొక్కినప్పుడో, వైరస్‌లతో కూడిన వెబ్‌సైట్లను చూసినప్పుడో అదును చూసుకొని దాడి చేసేస్తుంది.
ప్రస్తుతం రాన్‌సమ్‌వేర్ రకం వైరస్‌లు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తే గానీ పీసీని తెరవనీయని స్థితికి తీసుకొస్తున్నాయి. వీటి దెబ్బకు ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత వ్యాపార సంస్థలు, బ్యాంకులు సైతం చేతులెత్తేస్తున్నాయి. అడిగినంత డబ్బు చెల్లించి తమ పీసీలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ప్రతి 14 సెకండ్లకు ఒక వ్యాపారసంస్థ వీటి బారినపడుతున్నట్టు, ఫలితంగా కోట్లాది రూపాయలు ముట్టజెబుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థల సర్వేలు పేర్కొంటున్నాయి. వీటికి వ్యక్తులూ మినహాయింపేమీ కాదు. ఇలాంటి రాన్‌సమ్‌వేర్ దాడి జరిగినట్టు గుర్తిస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి. మరి కంప్యూటర్‌కు వైరస్ సోకిందని గుర్తించేదెలా? దీన్ని గుర్తించటానికి కొన్ని 'లక్షణాలు' లేకపోలేదు.
మాటిమాటికీ క్రాష్ అవటం
వైరస్ సోకినప్పుడు కంప్యూటర్ విచిత్రంగా ప్రవర్తించటం ఆరంభిస్తుంది. మాటిమాటికీ ఆఫ్ కావొచ్చు. దానంతటదే రీస్టార్ట్ కావొచ్చు. కొన్నిసార్లు హార్డ్ డిస్క్‌లో స్పేస్ పూర్తిగా నిండుకోవచ్చు. లేదంటే డేటా గానీ ప్రోగ్రామ్‌లు గానీ అదృశ్యమైపోవచ్చు. ఇవన్నీ వైరస్ సోకిందనటానికి ఆనవాళ్లే.
అదే పనిగా పాపప్‌లు
ఏదైనా వెబ్‌సైట్ చూస్తున్నప్పుడు మామూలుగా కన్నా పెద్ద మొత్తంలో పాపప్‌లు దర్శనమిస్తుంటే వైరస్ సోకిందేమోనని అనుమానించాలి. బ్రౌజర్‌లో, వెబ్‌సైట్లలో యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నా ఏదో సమస్య ఉన్నట్టే. యాడ్‌వేర్ ద్వారా ఇలాంటి వైరస్‌లు వ్యాపిస్తుంటాయి.
ఫైల్స్ యాక్సెస్ కాకపోవటం
వర్డ్‌ప్యాడ్‌ను తెరుస్తాం. ఏదో టైప్ చేయాలని చూస్తాం. కానీ టైప్ చేయటానికి అనుమతి లేదనే సందేశం ప్రత్యక్షమైతే? ఇది పీసీకి వైరస్ సోకిందటానికి స్పష్టమైన సంకేతం. హానికరమైన ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్ అయినప్పుడు మన పీసీలోని ఫైళ్లు యాక్సెస్ కావు. అనుమతి లేదని నిరాకరిస్తాయి.
వేగం నెమ్మదించటం
మామూలుగా కన్నా పీసీ వేగం నెమ్మదించినా అనుమానించాల్సిందే. వైరస్ సోకినప్పుడు కంప్యూటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కంప్యూటర్ బగ్స్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. దీంతో పీసీ మీద ఎక్కువ భారం పడుతుంది. చాలా పనులు చేయాల్సి వస్తుంది. దీంతో వేగం గణనీయంగా పడిపోతుంది.