టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభతరం చేసింది. దాదాపు అన్ని పనులు ఇంటినుంచే చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇదే అవకాశంగా కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. మీకు లాటరీ తగిలిందనో.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కోట్ల రూపాయలు సంపాదించొచ్చనో చెప్పి ఉన్న సొమ్మునంతా కాజేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల గురించి పెద్దగా అవగాహన లేని వారు ఇలాంటి మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు.
ఈ మోసాలను వేరువేరు పేర్లతో పిలిచినప్పటికీ.. అన్నింటిలో డబ్బులు పోగొట్టుకోవడం సాధారణంగా జరుగుతోంది. కొన్ని సార్లు సున్నితమైన సమాచారం తస్కరించి నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న పలు సైబర్ మోసాలు వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యూఆర్ కోడ్ మోసాలు
పెరిగిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో క్యూఆర్ కోడ్ అనేది కీలకంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలు కూడా పెరిగాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో పూర్తి అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
ఓఎల్ఎక్స్, క్విక్కర్ వంటి సైట్లలో వస్తువులను విక్రయానికి ఉంచినప్పుడు వాటిని కొనుగోలు చేస్తామంటూ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. పేమెంట్ రావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెబుతారు. ఇలా స్కాన్ చేసినప్పుడు పేమెంట్ అడుగుతుంది. అయితే విక్రయదారు చూసుకోకుండానే ఈ పేమెంట్‌ను చేస్తున్నారు.
కొనుగోలుదారుగా ఫోన్ చేసిన వారిని ఈ విషయమై సంప్రదించగా మరో కోడ్ పంపిస్తాం పోయిన డబ్బులు వస్తాయని నమ్మబలుకుతారు. మళ్లీ స్కాన్ చేసినప్పుడు కూడా చూసుకోకుండా పేమెంట్ చేస్తున్నారు. రెండు మూడు సార్లు పేమెంట్ చేశాక గానీ మోసపోయినట్లు విక్రయదారు గుర్తించడం లేదు.
కొన్ని నగదు చెల్లింపులు మధ్యలో ఆగిపోతే కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నంలో భాగంగా మోసాలకు గురవుతున్నారు కొందరు. కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఒక్కోసారి నకిలీ నంబర్‌ను సంప్రదించి నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఆ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డబ్బులు మీ ఖాతాలోకి వస్తాయని చెప్పి.. డబ్బులు దండుకుంటున్నారు.
- కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆయా బ్యాంకింగ్ సంస్థ అధికారిక వెబ్సైట్లో మాత్రమే వెతకండి. గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకున్నప్పటికీ.. కంపెనీ వెబ్సైట్ ద్వారా సరి చూసుకోవడం మర్చిపోవద్దు.
గిఫ్ట్ కార్డు మోసాలు..
కారు, ఫ్రిజ్, ఫోన్ లాంటివి గెలుచుకున్నారంటూ ఓ గిఫ్ట్ కార్డును ఇంటికి పంపిస్తారు సైబర్ నేరగాళ్లు. ఆ గిఫ్ట్ కార్డులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించగా.. గెలుచుకున్న దానిపై ఆశ కల్పిస్తారు. కారు రావాలంటే రిజిస్ట్రేషన్ చేయాలంటూ, బీమా చేయాలంటూ తదితర కారణాలతో డబ్బులు పంపించాలని అడుగుతారు. బహుమతి రాకపోయే సరికి మోసపోయినట్లు గ్రహిస్తున్నారు చాలా మంది.
- గిఫ్ట్ కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇవి దాదాపు మోసపూరితంగా ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా గిఫ్ట్ కార్డు వచ్చింది అంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.
సోషల్ మీడియా
ఈ మధ్య డేటింగ్ యాప్‌ల పాపులరిటీ పెరిగింది. వీటి ద్వారా మోసాలు కూడా ఎక్కువయ్యాయి. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని.. చనువు పెరిగిన అనంతరం మోసాలు చేస్తున్నారు కొందరు. సున్నితమైన సమాచారం, ఫొటోలు, డేటా సేకరించి బెదిరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల పేరుతో ఖాతాలు సృష్టించి .. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. కొన్ని రోజులు చాటింగ్ చేసి..సున్నితమైన సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
- సోషల్ మీడియాలో చాటింగ్, పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోకపోవటమే ఉత్తమం. ముఖ్యంగా అవతలి వ్యక్తి ఎవరో తెలియనప్పుడు మీకు సంబంధించి వివరాలేవీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
నకిలీ ఖాతాలు..
ప్రముఖులు, తెలిసిన వ్యక్తుల పేరు మీద నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నకిలీ ఖాతా నుంచి అత్యవసరంగా డబ్బు కావాలని అడుగతూ మోసగిస్తున్నారు.
- వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మీకు నిజంగా తెలిసి ఉంటే.. ఈ మోసం గురించి హెచ్చరించండి. అంతే కాకుండా ఫేస్బుక్లో ఎవరైనా ఫోన్ నంబర్ పంపి డబ్బు వేయమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకూడదు.
క్రెడిట్ కార్డు మోసాలు