How To Increase Mobile Internet Speed : ఇది స్మార్ట్ యుగం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే.. వీరిలో చాలా మందిని వేధించే సమస్య.. ఇంటర్నెట్ స్లో! ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నప్పుడో.. యూపీఐ చెల్లింపులు చేస్తున్నప్పుడో.. ఆన్లైన్లో మూవీస్ చూస్తున్నప్పుడో.. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ ఫోన్‌లో నెట్ స్పీడ్ సరిగా లేదా? అయితే.. కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి :
- మీ స్మార్ట్ ఫోన్‌లో నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ముందుగా ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్ స్పీడ్ పెరుగుతుంది.
- తర్వాత.. ఫోన్‌లో క్రాష్, కుకీస్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.
- స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతం అవుతుంది.
- ఒకేసారి చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయాలి.
- కొంత మంది స్మార్ట్ ఫోన్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేసుకుంటారు. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గవచ్చు. అందువల్ల ఆటో అప్‌డేట్ సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి.
- ఫోన్‌లోని డేటా సెట్టింగ్స్ ఒకసారి పరిశీలించండి. మీది 5G స్మార్ట్‌ఫోన్ అయి ఉండి.. డేటా సెట్టింగ్ 4G నెట్‌వర్క్‌లోనే ఉంటే కూడా నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది.
- మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వస్తే.. వాటిని స్కిప్ చేయకూడదు. వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ మెరుగవుతుంది.
- చాలా మంది ఫోన్లలో పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. కానీ.. అందులో ఉపయోగించేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. మీ ఫోన్‌లో కూడా ఉలా ఉంటే.. ఉపయోగించని యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేయండి. దీనివల్ల స్పేస్ క్లియర్ అవుతుంది. నెట్ వేగం కూడా పెరుగుతుంది.
- నెట్‌వర్క్ సరిగ్గా రాకపోతే.. మీ ఫోన్‌ను కొన్ని నిమిషాలపాటు ఎరోప్లెన్ మోడ్‌లో ఉంచండి. తరవాత నార్మల్ మోడ్ సెట్ చేయండి. నెట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి త్వరగా పనిచేసే ఎఫెక్టివ్ టిప్ ఇది.
- ఇన్ని చేసినా నెట్ స్పీడ్‌గా రాకపోతే.. ఒక్కసారి సిమ్ తీసి మళ్లీ వేయండి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
- మీరు రెండు SIM కార్డ్‌లను ఉపయోగిస్తూ ఉంటే.. సెట్టింగ్స్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోండి.
- మీ డేటా లిమిట్‌ను చేరుకొని ఉంటే కూడా నెట్‌స్పీడ్ తగ్గవచ్చు. అప్పుడు మరింత డేటా కోసం ఇతర ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకోండి.