Google Contacts Missing In Phone : మీకు తెలియకుండానే పొరపాటున మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కాంటాక్ట్స్ సింక్రనైజేషన్‌ను ఆఫ్ చేశారా..? అయితే ఇప్పటినుంచి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇలా చేస్తే మన ఫోన్‌లో ఉండే నంబర్లన్నీ మనకి తెలియకుండానే డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నెల గూగుల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ వెర్షన్‌తో ఇదివరకు ఎంతో సులభంగా ఉన్న కాంటాక్ట్స్ సింక్రనైజ్ సిస్టమ్ మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ఇంతకీ కాంటాక్ట్స్ సింక్రనైజేషన్ అంటే ఏమిటి.., గూగుల్ అకౌంట్‌కు లింక్ ఉన్న కాంటాక్ట్స్ సింక్రనైజ్ బటన్‌ను ఆఫ్ చేస్తే ఏమౌతుంది..? ఒకవేళ నంబర్లు డిలీట్ ఐతే తిరిగి పొందొచ్చా.. లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనుకోకుండా నొక్కారో.. అంతే సంగతి!
Google Contacts Delete : సాధారణంగా ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో కాంటాక్ట్ సింక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంతో భవిష్యత్‌లో మీరు కొత్త మొబైల్ ఫోన్‌కు మారినా.. ఈ అకౌంట్‌తో లాగిన్ అయితే పాత డివైజ్‌లో ఉన్న ప్రతి సమాచారం కొత్త దాంట్లో ప్రత్యక్షమవుతుంది. అయితే గూగుల్ తెచ్చిన గూగుల్ ప్లే సర్వీసెస్ v23.20 తాజా అప్డేట్ ద్వారా మీరు తెలిసో తెలియకో కానీ కాంటాక్ట్స్ సింక్రనైజేషన్‌ను ఆఫ్ చేస్తే.. అప్పటివరకు మీరు సింక్రనైజ్ చేసిన అన్నీ నంబర్లు డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ పాలసీ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.
వాటికి ఏమవ్వవు.. కానీ!
Google Contacts Recovery : అయితే మీరు అనుకోకుండా ఎప్పుడైనా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ కాంటాక్ట్స్ సింక్రనైజేషన్‌ను ఆఫ్ చేసినట్లయితే.. ఫోన్‌లో కనిపించే కాంటాక్ట్స్‌కు ఏమీ ఇబ్బంది ఉండదు. అప్పటివరకు మీరు సింక్ చేసిన మొబైల్ నంబర్లు అలానే ఉంటాయి. కానీ, మీరు ఏవైనా కొత్త మార్పులు చేస్తే గనుక అవి కేవలం మీ ఫోన్‌లో మాత్రమే ఉంటాయి తప్ప గూగుల్ అకౌంట్‌కు సింక్రనైజ్ అవ్వవు.