How To Find Hidden Cameras In A Room :ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతున్న అంశం సీక్రెట్ కెమెరా. మనకు తెలియకుండా మన ఇల్లు, ఆఫీసుల్లో శత్రువులు రహస్యంగా అమర్చే కెమెరాలను కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని కీలక మార్గాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రహస్య కెమెరా టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఇది గోప్యతకు ముప్పుగా మారింది. రహస్య కెమెరాలు ఎక్కువగా గోడ గడియారాలు, పవర్ బ్యాంక్‌లు, పిక్చర్ ఫ్రేమ్, అలంకరణ వస్తువులలో అమర్చుతుంటారు. అందువల్ల రహస్య కెమెరాలను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. మీ కార్యాలయంలో, హోటల్ గదిలో, అవుట్‌లెట్‌లో రహస్య కెమెరాలను అమర్చే అవకాశం ఉండొచ్చు. మన రహస్యాలను తెలుసుకోడానికి, గూఢచర్యం చేయడానికి ఈ రహస్య కెమెరాలను అమర్చుతుంటారు.
ప్రస్తుతం ఆన్లైన్లో అతి తక్కువ ధరకు రహస్య కెమెరాలు లభిస్తుండటం వల్ల వ్యక్తుల గోప్యత అనేది తీవ్రమైన ప్రమాదంలో పడింది. అయితే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతమున్న టెక్నాలజీని ఉపయోగించి.. ఇలాంటి రహస్య కెమెరాను చాలా సులువుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా RF డిటెక్టర్లు, కెమెరా లెన్స్ డిటెక్టర్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు, Wi-Fi స్కానర్‌ల సహాయంతో రహస్య కెమెరాలను పసిగట్టొచ్చు. అంతే కాదు నేరుగా మన కళ్లతో చూసి కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రహస్య కెమెరాలు చట్టవిరుద్ధమా?
రహస్య కెమెరాల కొనుగోలు పూర్తిగా చట్టబద్ధమే అయినప్పటికీ, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లో, మన పరిసరాల్లో హిడెన్ కెమెరాలను అమర్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇంటిని మరొకరికి అద్దెకు ఇచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు.. వారికి తెలియకుండా రహస్య కెమెరాలను అమర్చడం నేరం అవుతుంది. అలాగే ప్రభుత్వ సంస్థల వద్ద, రక్షణ ప్రాంతాల్లో మన వ్యక్తిగత రహస్య కెమెరాలు అమర్చడం చట్టవిరుద్ధమవుతుంది.
రహస్య కెమెరాలను ఎక్కడ ఉంచుతారు?
ఎదుటివారి రహస్యాలను తెలుసుకోడానికి నిఘా కెమెరాలను అమర్చుతారు. వాల్ అవుట్లెట్లు, గోడ గడియారాలు/ అలారం గడియారాలు, పవర్ బ్యాంకులు, USB డ్రైవ్‌లు, పెన్నులు, ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్స్, అద్దాలు, బొమ్మలు, మొక్కల కుండీలు, ఇతర అలంకరణ వస్తువులలో రహస్య కెమెరాలు ఉంచే అవకాశం ఉంది. వాల్ క్లాక్‌లు పెద్ద పరిమాణంలో ఉండడం కారణంగా రహస్య కెమెరాలు అమర్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
రహస్య కెమెరాలను గుర్తించడం ఎలా?
1. నేరుగా కళ్లతో చూడడం ద్వారా
మనకు అనుమానం ఉన్న ప్రాంతంలో నిశితంగా గమనించాలి. గోడ గడియారాలు, పూల కుండీలు లాంటి పెద్ద ఆకృతిలో ఉండే వస్తువుల్లో అమర్చే కెమెరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తు పట్టేయొచ్చు. ఒక వేళ కంటికి కనిపించకపోతే, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ స్పై కెమెరాలను గుర్తించవచ్చు.