ఆధార్.. ప్రతి భారతీయుడూ ప్రతి సందర్భంలోనూ వెంట ఉంచుకోవాల్సిన ధ్రువపత్రంలా మారిపోయింది. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా.. కొత్త సిమ్ తీసుకోవాలన్నా.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ దుర్వినియోగం గురించీ భయాందోళనలు ఉన్నాయి. ఒకవేళ మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం.
12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ఉండే ఆధార్ పత్రమే ఈ మాస్క్‌డ్ ఆధార్. దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం ఉన్న చోట మాత్రం ఇది ఉపయోగపడదనేది గుర్తుంచుకోవాలి. మీకూ మాస్క్‌డ్ ఆధార్ కావాలంటే ఈ దిగువ ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి..