How To Detect Deepfake Images : ప్రపంచ వ్యాప్తంగా ఐప్రూవ్ నిర్వహించిన సర్వే ప్రకారం, 71% మందికి డీప్‌ఫేక్ అంటే ఏమిటో తెలియదు. 43% మంది డీప్‌ఫేక్ ఇమేజ్‌లు, వీడియోలను గుర్తించలేకపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఇతరుల ఫొటోలు, వీడియోలు, గొంతుకలను కాపీ చేసి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, నకిలీ ఐడీలు, వాయిస్, ఫొటో, వీడియోలు సృష్టిస్తున్నారు. దీనినే సింపుల్‌గా డీప్‌ఫేక్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఈ డీప్‌ఫేక్ ఇమేజ్‌లు, వీడియోలు, వాయిస్‌లు గుర్తించడం కష్టం. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఏది నకిలీయో, ఏది అసలైనదో కనుగొనవచ్చు. కానీ మనం అప్రమత్తంగా లేకపోతే డీప్‌ఫేక్ వల్ల మోసపోయే అవకాశాలే ఎక్కువ. అందువల్ల సైబర్ మోసాలకు గురికాకుండా డీప్‌ఫేక్స్‌ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డీప్‌ఫేక్ అంటే ఏమిటి?
డీప్ లెర్నింగ్, ఫేక్ అనే రెండు పదాల కలయికే డీప్‌ఫేక్. డీప్ లెర్నింగ్ (AI)తో రూపొందించిన నకిలీ కంటెంట్‌నే డీప్‌ఫేక్ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఇది ఒక స్పూఫింగ్ టెక్నిక్. ముందుగా వ్యక్తుల భౌతిక ముఖ కవలికలు, ఆడియో, వీడియో డేటాను సేకరిస్తారు. వీటిని ఉపయోగించి, అధునాతన కృత్రిమ మేధస్సు సాయంతో డీప్‌ఫేక్ ఇమేజ్‌లు, వీడియోలు, గ్రాఫికల్ లేదా వాయిస్ కంటెంట్‌ను రూపొందిస్తారు. ఈ నకిలీ హైపర్‌రియలిస్టిక్ ఆడియో విజువల్‌ను రూపొందించడానికి AI ఎన్‌కోడింగ్ అల్గారిథమ్ లేదా జెనరేటివ్ యాంటీగోనిస్టిక్ నెట్‌వర్క్ (GAN)ను ఉపయోగిస్తారు. ఇలా AI సృష్టించిన వీడియో, ఆడియో లేదా ఫొటో ఒక వ్యక్తి (సింథటిక్ మీడియా) రూపాన్ని లేదా స్వరాన్ని అనుకరిస్తుంది. అత్యంత జనాదరణ పొందిన డీప్‌ఫేక్ వీడియోలలో ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్‌క్రూస్ సహా పలువురు సెలబ్రిటీల వీడియోలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది కొత్త టెక్నాలజీ ఏమీ కాదు. నిజానికి, హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియోలలో చాలా కాలంగా దీనిని ఉపయోగిస్తున్నారు. దీని వినియోగం పెరగడంతో, ఇప్పుడు చాలా డీప్‌ఫేక్ కమర్షియల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దీని దుస్పభ్రావాలను ముందే పసిగట్టిన ఫేస్‌బుక్ 2020లోనే తన ప్లాట్‌ఫాంలో డీప్‌ఫేక్‌ను నిషేధించింది.
డీప్‌ఫేక్‌తో డిజిటల్ సమాచార భద్రతకు ముప్పు?
వాస్తవానికి డీప్‌ఫేక్ టెక్నాలజీతో సమస్య లేదు. కానీ దానిని ఉపయోగించే విధానంతోనే సమస్య వచ్చిపడుతోంది. యూరోపోల్ నివేదిక ప్రకారం, డీప్‌ఫేక్‌లు చాలా ప్రమాదకరమని తేలింది. ఈ సాంకేతికత వల్ల ఎన్నో దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు స్పష్టమైంది. అందులో ప్రధానమైనవి ఏమిటంటే?
- వ్యక్తుల మాన, మర్యాదలకు భంగం కలిగిస్తూ, వారి అశ్లీల చిత్రాలను రూపొందించడం.
- నకిలీ బయోమెట్రిక్ పాస్‌వర్డ్‌లను సృష్టించడం.
- డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మోసాలకు పాల్పడడం.
- తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు ప్రచారం చేయడం.
- వ్యక్తుల గుర్తింపును దొంగిలించడం (ఐడెంటిటీ థెఫ్ట్).
- వ్యక్తులను బెదిరించడం, ఆర్థికంగా దోచుకోవడం.
డిజిటల్ మోసాలు
నేడు సైబర్ మోసగాళ్లు నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రెండు దేశాలు లేదా ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను అస్థిరపరిచే ప్రమాదం కూడా ఉంది.
పెరుగుతున్న నేరాలు
డీప్‌ఫేక్ కంటెంట్‌ను క్రియేట్ చేయడం ద్వారా బ్లాక్ మెయిలింగ్ చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ సాంకేతికత తక్కువ ఖర్చుతో లభిస్తున్నందున, నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని యూరోపోల్ ఆందోళన వ్యక్తం చేసింది.
డీప్‌ఫేక్‌ను గుర్తించడం ఎలా?
ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్స్ యూఎస్ఏ ప్రకారం, డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తిండం కాస్త కష్టమే. ముఖ్యంగా సింథటిక్‌గా రూపొందించిన చిత్రాలు చాలా వరకు రియలిస్టిక్‌గా ఉంటున్నాయి. వాస్తవానికి అవి అసలు వాటికి ఏమాత్రంగా తీసిపోని విధంగా ఉండటంతో నమ్మాల్సి వస్తోంది. అయితే ఈ డీప్‌ఫేక్స్‌ను గుర్తించడం అసాధ్యమేమీ కాదు.
ఫ్లాష్‌ల సంఖ్య
వీడియోలోని చిత్రం ఎన్నిసార్లు ఫ్లాష్ అవుతుందనే దానిని పరిశీలించడం ద్వారా డీప్‌ఫేక్ గుర్తించొచ్చు. సాధారణంగా డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలు చాలా వరకు అసహజంగా ఉంటాయి.