ఫోన్ స్క్రీన్‌పై స్టోరేజ్ నిండిందనే మెసేజ్ కనిపించగానే వెంటనే అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేస్తాం. అయినా కూడా స్టోరేజ్ ఫుల్ అనే చూపిస్తుంది. ఫైల్స్ డిలీట్ చేసినా ఎందుకు అలా చూపిస్తుంది? కొన్నిసార్లు ఫోన్ నుంచి డేటా డిలీట్ చేసినా సదరు ఫైల్స్ బయటివారికి చేరిపోతుంటాయి. మరి మన ఫోన్ నుంచి అవసరంలేని ఫొటో, వీడియో, ఫైల్స్‌ను శాశ్వతంగా ఎలా డిలీట్ చేయాలి? మనం డిలీట్ చేసిన డేటా ఇతరుల చేతికి చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.
ఫైల్ మేనేజర్
ఆండ్రాయిడ్ ఫోన్లో ఫైల్స్ డిలీట్ చేసిన తర్వాత అవి సదరు ఫోల్డర్లో ఉన్న ట్రాష్ లేదా రీసైకిల్ బిన్ ఫోల్డర్లోకి వెళతాయి. అంటే అవి ఇంకా ఫోన్లో ఉన్నట్లే. అందుకే ఫోన్ నుంచి ఫైల్స్‌ను శాశ్వతంగా డిలీట్ చేసేందుకు ఫైల్ మేనేజర్ లేదా ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఇందుకోసం మీ ఫోన్లోని ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. అలా చేయడం వల్ల మీరు సెలక్ట్ చేసిన ఫైల్స్ ఫోన్ నుంచి శాశ్వతంగా డిలీట్ అవుతాయి. అయితే మీ ఆండ్రాయిడ్ ఖాతా గూగుల్ ఫొటోస్ లేదా డ్రైవ్ వంటి ఇతరత్రా క్లౌడ్ స్టోరేజ్ సేవలకు అనుసంధానమైతే వాటి నుంచి కూడా డిలీట్ చేయాలి.
ఫైల్ ష్రెడ్డర్
కొత్త ఫోన్‌ను కొన్నప్పుడు పాత ఫోన్‌ను ఎక్స్చేంజి లేదా తక్కువ ధరకు అమ్మేస్తాం. ఇతరులు డేటా రికవరీ టూల్స్‌తో అందులోని ఫైల్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. అందుకే గూగుల్ ఆండ్రాయిడ్ 6 ఆపై వెర్షన్ ఓఎస్‌లకు ఎన్క్రిప్షన్ రక్షణ కల్పిస్తుంది. అయితే కొన్నిసార్లు మన ఫోన్లో డేటా ర్యాండమ్ క్యారెక్టర్స్‌తో వేర్వేరు చోట్ల సేవ్ అవుతుంది. అలాంటి వాటిని గుర్తించి డిలీట్ చేయడం కష్టం. దాంతో ఫోన్ నుంచి డేటా డిలీట్ చేసినా వేరే పేరుతో ఇంకో ఫోల్డర్లో ఉంటుంది. వాటిని కూడా డిలీట్ చేసేందుకు ఫైల్ ష్రెడ్డర్ టూల్స్ సాయం తీసుకోవాల్సిందే. ఇవి ఐష్రెడ్డర్, ష్రెడ్డిట్, డేటా ఎరేసర్ పేరుతో యాప్‌ల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి.
వీటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతివ్వాలి. తర్వాత యాప్ హోం స్ర్కీన్‌లో ఫ్రీఅప్ స్పేస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ సెలెక్ట్ చేయాలి. దాంతో యాప్ మీ ఎంత స్టోరేజ్ ఖాళీ చేయాలనేది అంచనా వేస్తుంది. అది పూర్తయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే ఫోన్ స్టోరేజ్ నుంచి మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌ను శాశ్వతంగా తొలగిస్తుంది. దాంతో వాటిని రీస్టోర్ చేయడం సాధ్యంకాదు. అలానే మీ ఫోన్లో వేర్వేరు పేర్లతో ఉన్న ఒకేరకమైన ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. ఈ ప్రక్రియ జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే ఫోన్లో నోటిఫికేషన్ బార్లోకి వెళ్లి క్యాన్సిల్ క్లిక్ చేసి ఆపేయొచ్చు.
యాప్ ద్వారా వద్దనుకుంటే..
ఒకవేళ మీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి కూడా ఫైల్స్‌ను డిలీట్ చేయొచ్చు. ముందుగా మీ ఫోన్‌ను యూఎస్బీ కేబుల్‌తో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్లో ఆటోప్లే ఆప్షన్స్ కనిపిస్తుంది. అందులో ఓపెన్ డివైజ్ టు వ్యూ ఫైల్స్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. కంప్యూటర్లో మై కంప్యూటర్ లేదా దిస్ పీసీలోకి వెళితే ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ మీకు ఫోన్ స్టోరేజ్ ఖాళీగా కనిపిస్తే.. ఫోన్లో యూఎస్బీ ఛార్జింగ్ దిస్ డివైజ్‌లో ఫైల్ ట్రాన్స్ఫర్ లేదా ట్రాన్స్ఫర్ ఫైల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత కంప్యూటర్లో ఫోన్ ఐకాన్‌పై క్లిక్ చేసి డీసీఐఎమ్ ఫోల్డర్లోకి వెళ్లి కెమెరాపై క్లిక్ చేయాలి.