Wifi Users Check: ప్రస్తుత రోజుల్లో మొబైల్ డేటా, వైఫై (వైర్లెస్ ఫెడిలిటీ) అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇవి కూడా నిత్యజీవితంలో భాగమైపోయాయి. కరోనా లాక్డౌన్ తర్వాత ఇంటర్నెట్ వినియోగం అధికమై వైఫై కనెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే, కొందరు అపరిచితులు సాంకేతిక పరిజ్ఞానంతో వైఫై పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసి ఇంటర్నెట్ను తెగ వాడేస్తుంటారు. దీంతో మన ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం పరిపాటి అయిపోతోంది. మరి ఇలా మన వైఫైను ఇతరులు వాడకుండా సురక్షితంగా ఎలా ఉంచుకోవాలనే సింపుల్ ట్రిక్స్పై ఓ లుక్కేద్దామా..
- ముందుగా ఇంటర్నెట్ నెట్వర్క్కి కనెక్ట్ చేసిన డివైస్‌లో వెబ్ బ్రౌజర్‌ను తెరిచి 192.168.0.1/192.168.1.1/192.168.2.1లో ఏదో ఒక అడ్రస్‌ను ఎంటర్ చేసి రూటర్‌లోకి లాగిన్ అవ్వాలి. వీటిలో ఏదీ పని చేయకుంటే సిస్టమ్‌లోని కమాండ్ (cmd) ప్రాంప్ట్ తెరిచి ipconfig/all అని ఎంటర్ చేయగానే డిఫాల్ట్ గేట్‌వే పక్కన రూటర్ ఐపీ అడ్రస్ కనిపిస్తోంది.
- తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ రూటర్ పాస్వర్డ్ తెలియకపోతే వైఫై రూటర్ మీద ఉన్న స్టిక్కర్‌పై చెక్ చేసి రీసెట్ చేసుకోవాలి. అలాకాకుంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.
- ఒకసారి లాగిన్ అయ్యాక 'వైఫై క్లయింట్ల జాబితా','కనెక్ట్ అయిన డివైస్'ను కనుగొనడానికి నావిగేట్ చేసుకోవాలి. అలాగే కొన్ని మనకు తెలియని కనెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో గుర్తించాలి.
- అలాగే కమాండ్‌లో arp-a అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా వైఫైకి ఏయే డివైస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో తనిఖీ చేయవచ్చు.