వ్యక్తిగత ఆలోచనలతో పాటు, సమకాలీన అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు సామాజిక మాధ్యమాలు చక్కనైన వేదికలు. అంతేకాదు, పరిచయం లేని వ్యక్తుల గురించి ప్రాథమిక వివరాలు తెలుసుకునేందుకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాల్లోని వివరాలు బహిర్గతం కావడం యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో తమ ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ అయినట్లు పెడుతున్న మెసేజ్‌లు చూస్తూనే ఉన్నాం. దీంతో అందులోని ఫొటోలు, మెసేజ్‌లు వంటి సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందని ఆందోళన చెందుతుంటాం. ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో ఓ సారి తెలుసుకుందాం.
1. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్..
ఫేస్‌బుక్ ఖాతా హ్యాకర్ల బారిన పడకూడదంటే మీ అకౌంట్ సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసుకోవాలి. ఇందులో భాగంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసుకోవాలి. దీని వల్ల కొత్త డివైజ్ నుంచి ఫేస్‌బుక్ లాగిన్ అయ్యే సమయంలో పాస్‌వర్డ్‌తో పాటు స్పెషల్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకర్‌కు తెలిసినా.. కోడ్ లేకుండా అకౌంట్ లాగిన్ అవ్వలేరు.
ఫేస్‌బుక్ అకౌంట్లో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసేందుకు ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో సెక్యూరిటీ అండ్ లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం పాస్వర్డ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి.
టెక్ట్స్ మెసేజ్ (ఎస్ఎంఎస్):
ఫేస్‌బుక్ వెబ్సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయ్యే సమయంలో మీ మొబైల్‌కు ఎఫ్బీ నుంచి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. పాస్వర్డ్ నమోదు చేసినా సరే.. ఈ లాగిన్ కోడ్ ఎంటర్ చేయకపోతే మాత్రం మీరు ఫేస్‌బుక్ లాగిన్ అవ్వలేరు.
అథెంటికేషన్ యాప్:
ఇది కూడా టెక్ట్స్ మెసేజ్ మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో మెసేజ్‌కు బదులుగా థర్డ్ పార్టీ యాప్‌లో న్యూమరిక్ కోడ్ వస్తుంది. అయితే ఏది పడితే అది కాకుండా నమ్మకమైన థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ట్విలియోస్ ఆథీ, గూగుల్ అథెంటికేటర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడటం సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు.
సెక్యూరిటీ కీ:
ఫేస్‌బుక్ అకౌంట్‌కు టెక్ట్స్ మెసేజ్ రూపంలో భద్రత వద్దనుకుంటే ఫిజికల్ సెక్యూరిటీ కీ ద్వారా కూడా అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం యుబికో లాంటి చిన్న డాంగిల్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేసే ప్రతిసారి సంబంధింత డివైజ్‌లో డాంగిల్‌ను ప్లగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఫేస్‌బుక్ యూజర్లకు ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు.
2. ఈ-మెయిల్ పనిచేస్తోందా?.. చెక్ చేసుకోండి..
మీ ఫేస్‌బుక్ ఖాతాకు లింక్ అయిన ఈ-మెయిల్‌ను మీరు ప్రస్తుతం వాడకపోయినా లేదా అది పనిచేయకున్నా మీకు సమస్యే. దీని వల్ల మీరు పాస్వర్డ్ రీసెట్ చేయడం కుదరదు. కాబట్టి ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉన్న ఈ-మెయిల్‌ను అప్డేట్ చెయ్యండి. అలాగే ఈ-మెయిల్ పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోండి. దానికి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి. ఫేస్బుక్లో ఈ-మెయిల్ అప్డేట్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్లాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత జనరల్‌ను ఎంచుకోవాలి. అక్కడ కాంటాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఉండే ఈ-మెయిల్ అడ్రస్ పాతదైతే దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది.
3. పాస్‌వర్డ్‌తో జాగ్రత్త..
మీ ఫేస్‌బుక్ ఖాతాలో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్‌లో ఉన్నా పాస్వర్డ్ కూడా బలంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. పాస్వర్డ్ ఏది పడితే అది పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వేర్వేరు కాంబినేషన్లతో విభిన్నమైన, బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే వన్పాస్వర్డ్, డ్యాష్లేన్ లాంటి యాప్స్ సాయం తీసుకోవచ్చు. పాస్ వర్డ్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే వాటిని డైరీలో లేదా ఏదైనా పుస్తకంలో రాసుకోవాలి.