తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మనిషికి 'తోక' ఎందుకు లేదు? ఎప్పుడైనా ఆలోచించారా.. - news today

తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది. నిజానికి తోకల కథ 50 కోట్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. అప్పట్నుంచీ ఎన్నెన్నో పరిణామాలతో ఇవి ఆశ్చర్యం గొలుపుతూనే ఉన్నాయి. ఒక్కో జంతువు, ఒక్కో పక్షి ఒక్కోలా వీటిని వాడుకోవటం చూస్తుంటే 'ఔరా తోక' అనాల్సిందే. మరి మనిషికి తోకెందుకు లేదు? పరిణామక్రమంలో మనిషి తోక ఎలా మాయమైంది? వీటిపై శాస్త్రరంగంలో రసవత్తర చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే దీనిపై ఓ కొత్త సంగతి బయటపడింది. ఈ నేపథ్యంలో అసలు తోకల కథేంటో చూద్దాం.

How Humans Lost Their Tails?
మనిషికి 'తోక' ఎందుకు లేదు?TAIL

By

Published : Sep 29, 2021, 9:46 AM IST

జీవ పరిణామంలో తోక చరిత్ర పెద్దదే. మన పూర్వికుల, వారి పూర్వికుల, వారి పూర్వికుల దగ్గర మొదలెడితే.. చేపల రూపంలో ఉన్నప్పుడే ఈదడానికి తోకల సాయం తీసుకున్నాం. వానరాల దశకు చేరుకునే సరికి ఒక కొమ్మ మీది నుంచి మరో కొమ్మకు దూకటానికి శరీర నియంత్రణకు ఉపయోగించుకున్నాం. ఎందుకోగానీ సుమారు 2.5 కోట్ల ఏళ్ల కిందట మన తోకలు మాయమైపోయాయి. చార్లెస్‌ డార్విన్‌ మహాశయుడు మన పూర్వికుల శరీర నిర్మాణంలో ఈ మార్పును తొలిసారి గుర్తించారు. అయితే తోక ఎందుకు మాయమైంది?ఎలా మాయమైంది? అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. దీనిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా న్యూయార్క్‌ పరిశోధకులు గొప్ప విషయాన్నే గుర్తించారు. మన పూర్వికుల్లో తోకలు మాయం కావటానికి జన్యు మార్పేనని స్పష్టంగా తేల్చేశారు. గొరిల్లాలు, చింపాంజీల వంటి తోకలేని కోతుల (ఏప్స్‌) పరిణామ దశలోనే ఈ మార్పు మొదలైంది. తోక ఏర్పడటంలో పాలు పంచుకునే 31 రకాల జన్యువులను పరిశీలించి మరీ దీన్ని కనుగొన్నారు. ఇందులోని నిజానిజాలు తెలుసుకోవటానికి ఎలుకల్లో ఆ జన్యువును మార్చి పరిశీలించారు కూడా. దీంతో ఎలుకల్లో తోకలు ఏర్పడకపోవటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఏప్స్‌ తోక ఒక్కసారిగా మాయమై ఉంటుందనే అనుకోవాలి. మనిషి పరిణామ క్రమంలో తోక కనుమరుగు కావటం గణనీయమైన ప్రభావాన్నే చూపించింది. మన పూర్వికుల్లో తోక కండరాలు మొదట్లో కటి భాగం వద్ద అడ్డంగా ఓ వల ఊయలగా మారిపోయాయి. రెండు కాళ్ల మీద నిల్చొని, నడవటం ఆరంభించాక నిట్టనిలువుగా మారిన అవయవాల బరువుకు దన్నుగా నిల్చినవి ఈ కండరాలే. దీని అవశేషం మన వెన్నెముక అడుగున కాక్సిక్స్‌ ఎముక రూపంలో ఇప్పటికీ మిగిలే ఉంది.

అసలు తోకెందుకు?

శరీర నిర్మాణంలో తోకల పాత్ర అనూహ్యమనే చెప్పుకోవాలి. పక్షులు గాల్లో ఎగురుతున్నప్పుడు పక్కలకు తిరగటానికి, వేగ నియంత్రణకు తోడ్పడేవి తోకలే. కొన్నిరకాల బల్లులు వీటిని కొవ్వును నిల్వ చేసుకోవటానికి ఉపయోగించుకుంటాయి. ర్యాటిల్‌ స్నేక్‌ తోకను గబగబా ఊపుతూ శత్రువులను బెదరగొడుతుంది. అయితే చాలా క్షీరదాల్లో తోక చేసే ముఖ్యమైన పని శరీర నియంత్రణ. నడుస్తున్నప్పుడు, పరుగెత్తుతున్నప్పుడు శరీరం స్థిరంగా ఉండటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. మరి మనిషికి తోకెందుకు లేదు? ఉంటే ఎందుకు మాయమైంది? ఒక్క మాటలో చెప్పాలంటే వాడాల్సిన అవసరం లేకపోవటం వల్లనే. వానర దశలో రెండు కాళ్ల మీద నిల్చొని, నడవటం ఆరంభించాక గురుత్వాకర్షణ ప్రభావాన్ని అనువుగా మలచుకోవటానికి వీలు ఏర్పడింది. ఒకో అడుగు వేస్తున్న ప్రతిసారీ గురుత్వాకర్షణ శక్తి సాయంతో తేలికగా ముందుకు కదలటం సాధ్యమైంది. నాలుగు కాళ్లతో పోలిస్తే రెండు కాళ్ల మీదైతే 25% తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం నడవటానికి అవకాశం ఏర్పడింది. శక్తి వినియోగం 28 గ్రాములు తగ్గినా పెద్ద ప్రభావమే చూపిస్తుంది. అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఇది ఆకలిని తట్టుకోవటం, మనుగడ సాగించటంలో కీలకమైన పాత్ర పోషించింది. మన తల 5 కిలోల బరువు ఉన్నప్పటికీ.. నడుస్తున్నప్పుడు శరీరం పైబాగాన ఉంటుంది. నాలుగు కాళ్ల జంతువుల మాదిరిగా ముందుకు ఉండదు. దీంతో శరీర నియంత్రణకు తోక అవసరం తగ్గిపోయింది. ఇలా క్రమంగా కనుమరుగు అవుతూ వచ్చింది. అయితే పిండస్థ దశలో 31 నుంచి 35 రోజుల మధ్యలో మనందరికీ తోక ఉంటుంది. కాకపోతే ఇది కుంచించుకుపోయి వెన్నెముకలో కలిసిపోతుంది. చివరికి తోక ఎముకలా (కాక్సిక్స్‌) మారిపోతుంది.

వేటి ప్రత్యేకత వాటిదే..

ఒకోటి ఒకోలా

నిషికి తప్ప వెన్నెముక గల జీవులన్నింటికీ తోక ఉంటుంది. వీటిల్లో చాలా రకాలున్నాయి. కొన్ని పొడవుగా ఉంటే కొన్ని పొట్టిగా ఉంటాయి. కొన్ని కుచ్చుతో ఉంటే మరికొన్ని నున్నగా ఉంటాయి. వేటి ప్రత్యేకత వాటిదే. జంతువులు, పక్షులు, చేపలు వీటిని ఒకోటి ఒకోలా వినియోగించుకుంటాయి.

సమాచారం కోసం: కుక్కలు భావోద్వేగాలను తోకను కదల్చటం ద్వారానే తెలియజేస్తాయి. ఇవి ఆయా భావాలకు అనుగుణంగా తోకలను పక్కలకు, పైకీ కిందికీ కదిలిస్తాయని ఇటీవలి అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. పిల్లులైతే తోకతో మరిన్ని భావాలను తెలియజేస్తుంటాయి. భయం, చిరాకు, ఆనందం వంటి భావాలను తోకను ఎత్తటం, దించటం, పక్కలకు తిప్పటం వంటి పనులతోనే వెలిబుచ్చుతుంటాయి.

శరీర నియంత్రణ: చాలా జంతువులు శరీర నియంత్రణ కోసమే తోకలను వినియోగించుకుంటాయి. సన్నటి గోడ మీద పిల్లి నడుస్తున్నప్పుడు చూస్తే తోకను కదిలించటం ద్వారా స్థిరత్వాన్ని సాధించటం గమనించొచ్చు. ఉడతలైతే ఒక కొమ్మ మీది నుంచి మరో కొమ్మ మీదికి దూకుతున్నప్పుడు గాలిలోనూ తోకతోనే శరీరాన్ని నియంత్రించుకుంటాయి.

కదలికలకు:కొన్ని జంతువులు కదలటానికి తోకే చాలా కీలకం. చేపల వంటి వాటికిది మరింత ముఖ్యం. దీని సాయంతోనే ఇవి ముందుకు కదులుతాయి. సముద్ర జీవుల తోకలు పైకీ కిందికీ కదలటం వల్లనే అవసరమైనప్పుడు నీటి పైకి వచ్చి గాలిని పీల్చుకుంటాయి.

రక్షణకు: చాలా క్షీరదాలు తోకను రక్షణ కోసం వాడుకుంటాయి. ర్యాటిల్‌ స్నేక్‌ చాలా ప్రాణాంతకమైనదైనప్పటికీ.. శత్రువులను బెదర గొట్టటానికి తోకను ఊపుతూ పెద్ద శబ్దం చేస్తుంటాయి. బల్లులు తమను తాము రక్షించుకోవటానికి తోకలను పూర్తిగా శరీరం నుంచి వదిలించేసుకుంటాయి కూడా. ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు అలుగు (ఆర్మడిల్లో) తన తలను, తోకను ఒకదగ్గరికి చేర్చి బంతిలా మారిపోతుంది.

దాడి చేయటానికి:కొన్ని జంతువులకు తోకే ఆయుధం. దీంతోనే దాడి చేస్తాయి. తేలు తోక తెలిసిందే కదా. దీనికి ఉండే కొండితోనే కుట్టేస్తాయి. ఇవి తోకతో ఆహారాన్నీ వేటాడతాయి. పదునైన కొండితో కీటకాల వంటి వాటిని పట్టుకొని తింటాయి.

ఎగరడానికి:పక్షులకు రెండు రకాల ఈకలుంటాయి. రెక్కల్లోని ఈకలు దన్నుగా నిలిస్తే.. తోకలోని ఈకలు చుక్కానిలా ఉపయోగపడతాయి. గాల్లో ఎగురుతున్నప్పుడు ఇవి స్థిరతాన్ని కలిగిస్తాయి. తేలికగా అటూ ఇటూ మళ్లటానికి తోడ్పడతాయి.

ఆకర్షణకు: మగ నెమళ్లు పురి విప్పటం ద్వారానే ఆడ నెమళ్లను ఆకర్షిస్తుంటాయి. మన వేలి ముద్రల మాదిరిగానే నెమళ్ల తోకలు వేటికదే ప్రత్యేకం. చాలా పెద్దగా, ప్రకాశవంతమైన పురిని విప్పే నెమళ్లు మరింత ఎక్కువగా ఆకర్షిస్తాయి.

క్రిములను పారదోలటానికి: ఆవులు, గుర్రాలు, జీబ్రాల వంటివి పొడవైన తోకలుండే జంతువులు సౌలభ్యం కోసమే వీటిని వినియోగించుకుంటాయి. ఈగలు, క్రిములు, కీటకాల వంటి వాటిని పారదోలటానికి వాడుకుంటాయి.

గిరి గీయటానికి:నీటి గుర్రం తోకను చోదకం మాదిరిగానూ తిప్పగలదు. దీంతో విసర్జన సమయంలో మలాన్ని చుట్టుపక్కల ప్రాంతానికి వెదజల్లుతుంది. ఇలా తనుండే చోటును గిరి గీసుకుంటుంది.

ఇవీ చూడండి: ఈమె మనిషి కాదు.. కానీ సంపాదన మాత్రం కోట్లలో!

Unicode Emojis: ట్రోలింగ్‌, పిచ్చుక గూడు.. ఇప్పుడు ఇవీ ఎమోజీలే!

వందేళ్ల కల సాకారం దిశగా.. 'వైర్​లెస్​ విద్యుత్'

జీవజాలానికి రక్షాకవచం.. ఓజోన్!

ABOUT THE AUTHOR

...view details