GPay QR code shortcut :సాంకేతిక విప్లవంలో భాగంగా మనం ఇప్పుడు నగదును కాకుండా డిజిటల్ విధానంలో ఎలాంటి చెల్లింపులైనా చేసేస్తున్నాము. డిజిటల్ పేమెంట్ల కోసం మనకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నా చాలా మంది గూగుల్పేని విశ్వసిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లలో సరికొత్త అనుభవాన్ని అందించడానికి తాజాగా గూగుల్‌పే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో పేమెంట్ విధానం మరింత సులభతరం కానుంది. తద్వారా చెల్లింపుల సమయంలో విలువైన సమయం ఆదా కావడం సహా చాలా అసౌకర్యాలను అధిగమించేలా ఆప్డేట్ చేసింది.
పేమెంట్ చేసేటప్పుడు యాప్‌ను ఓపెన్ చేయడం, స్కానర్ ఆన్ చేయడం, పేమెంట్ చేయడం వంటి పనులను ఒక్క క్లిక్‌తో పూర్తి చేసేలా ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. మొబైల్ హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌గా క్యూఆర్ కోడ్ ఉండేలా ఫీచర్‌ను తీర్చిదిద్దింది. దీనివల్ల ఒకే క్లిక్‌తో యూపీఐ చెల్లింపులు ఈజీగా చేసుకోవచ్చు. అన్ని స్మార్ట్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కానర్‌ను జోడించడం చాలా సరళమైన ప్రక్రియగా మార్చింది గూగుల్ పే.
ఇలా హోం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్!
- గూగుల్‌పే షార్ట్‌కట్‌ను మీ ఫోన్‌లో ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్స్టాల్ చేసి ఉంటే అప్డేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ హోం హోమ్ స్క్రీన్‌పై ఉన్న గూగుల్‌పే లోగోను లాంగ్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఓ షార్ట్‌కట్ మెనూ ఓపెన్ అవుతుంది.
- అందులో 'Scan Any QR' అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయాలి. వెంటనే స్కానర్ మీ హోం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
- ఈ షార్ట్‌కట్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. అది ఓకే చేశాక మీరు పేమెంట్ చేయాలనుకున్నప్పుడు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తుంది. థర్డ్ పార్టీ చెల్లింపుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్‌లను ఈ షార్ట్ కట్ అనుమతిస్తుంది.