తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Google Internet Safety: ఇంటర్నెట్ భద్రత కోసం గూగుల్​ ఏబీసీలు!

కోట్లమందికి ఎంతో ఆధారమైన ఇంటర్నెట్​ గురించి దిగ్గజ వెబ్​సైట్ గూగుల్ కొన్ని విషయాలు చెప్పింది. ఆ ఏబీసీలను గుర్తుంచుకోవాలని సూచించింది. ఇంతకీ అవేంటంటే?

google
గూగుల్

By

Published : Sep 8, 2021, 5:22 PM IST

Updated : Sep 8, 2021, 5:30 PM IST

మనలో చాలామందికి ఇంటర్నెట్‌ అవసరం.. మరికొంతమందికి అదో వ్యసనం. కొత్త విషయాలను తెలుసుకోవడం నుంచి ఆర్థిక లావాదేవీలు, టికెట్ బుకింగ్(ticket booking), షాపింగ్, గేమింగ్, సోషల్ నెట్‌వర్కింగ్‌, వ్యాపారం, మార్కెటింగ్.. ఇలా ఎన్నో రకాల సేవలు ఇంటర్నెట్‌(internet) ద్వారా పొందుతున్నాం. అయితే ఇంటర్నెట్‌ ఉపయోగించేవారిలో కొంతమంది అవగాహన లేకపోవడం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. హ్యాకర్స్‌, సైబర్‌ నేరగాళ్లు ఇదే అదనుగా నకిలీ మెయిల్స్‌, మెసేజ్‌లతో ఇంటర్నెట్ యూజర్స్‌ను ఏమార్చి వారికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. అందుకే ఇంటర్నెట్ ఉపయోగించేప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలంటుంది ప్రముఖ్య సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం గూగుల్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్ గూగుల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ భద్రత గురించి గూగుల్ ఇండియా యూజర్స్‌కు మూడు ముఖ్యమైన సూచనలు చేసింది.

"మనం మరోసారి చిన్నతనంలో చదువుకున్న ఏబీసీలను నేర్చుకుందాం. అయితే ఈ సారి ఏబీసీలు ఇంటర్నెట్ భద్రతకు సంబంధించినవి" అంటూ ట్విటర్‌లో పేర్కొంది. ఇంతకీ గూగుల్ చెప్పిన ఏబీసీలు ఏంటి? వాటిని పాటిస్తే ఇంటర్నెట్‌లో ఎలాంటి రక్షణ ఉంటుందనేది తెలుసుకుందాం.

A - వ్యక్తిగత వివరాలకు గోప్యతే రక్షణ

A అంటే ఆల్వేస్‌ కీప్‌ యువర్‌ ప్రయివేట్ డిటెయిల్స్‌ టు యువర్‌సెల్ఫ్‌. వ్యక్తిగత వివరాలు..మనకు ఇష్టమైన వ్యక్తులు, విషయాలు గురించిన సమాచారం ఎప్పుడూ గోప్యంగా ఉంచాలంటుంది గూగుల్. అంటే పుట్టినరోజు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, మనకు నచ్చిన సినిమా తారలు, ఆటగాళ్లు, ఫుడ్ వంటి వివరాలు ఎప్పటికీ అపరిచితులతో పంచుకోవద్దని సూచిస్తుంది. కొన్నిసార్లు మీరు ఎంచుకునే పాస్‌వర్డ్‌లు(password) లేదా యూజర్‌ నేమ్‌లు(username) వాటికి దగ్గరగా ఉంటే హ్యాకర్స్ సులువుగా మీకు సంబంధించిన సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే ముఖ్యమైన సమాచారం ఎప్పుడూ గోప్యంగా ఉంచాలని సూచిస్తుంది.

B - వాటితో జాగ్రత్త సుమా!

B అంటే బివేర్‌ ఆఫ్‌ ది బ్యాడ్ యాక్టర్స్ ఇన్ యువర్ ఇన్‌బాక్స్‌. ఆన్‌లైన్‌లో ఎన్నో రకాల వెబ్‌సైట్లలో సమాచారం కోసం వెతికేప్పుడు మెయిల్ ఐడీ వివరాలు అడుగుతాయి. మనం వివరాలు ఇస్తే సదరు వెబ్‌సైట్‌ లేదా కంపెనీలకు సంబంధించిన న్యూస్‌లెటర్ లేదా ప్రకటనలు సంబంధించిన వివరాలు మెయిల్‌ ద్వారా పంపుతుంటారు. వాటిలో కొన్ని నకిలీవి ఉండొచ్చు. వాటిని ఓపెన్ చేసిన వెంటనే మన డివైజ్‌లోకి వైరస్ రావడమో లేదా మన వివరాలు హ్యాకర్స్‌ చేరిపోవడమో జరుగుతుంది. అందుకే స్పామ్‌, ఫిషింగ్ మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని గూగుల్ హెచ్చరిస్తుంది. అలానే నకిలీ ఈ-మెయిల్స్‌ను(fake email) గుర్తించి యూజర్‌కు తగు సూచనలు చేసేందుకు జీమెయిల్‌లో స్పామ్ ఫిల్టర్స్‌, ఫిషింగ్ ప్రొటెక్షన్ టూల్స్‌ను ఇస్తున్నారు.

C - ఎప్పటికప్పడు మార్చాల్సిందే మరి!

C అంటే ఛేంజ్ యువర్ పాస్‌వర్డ్స్‌ ఫ్రీక్వెంట్లీ. ఎప్పటికప్పుడు మీ పాస్‌వర్డ్‌లను(password change google) మారుస్తూ ఉండండి. ఇది టెక్ సంస్థలు తమ యూజర్స్‌కు తరచుగా చెప్పే మాట. ఇదే విషయాన్ని గూగుల్ మరోసారి గుర్తుచేస్తుంది. మీ పాస్‌వర్డ్ భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచిస్తుంది. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఎప్పడు మార్చాలనే విషయంలో మీకు ఏదైనా సందేహం ఉంటే పాస్‌వర్డ్ చెకప్‌ చేయమని సూచించింది. ఈ పాస్‌వర్డ్ చెకప్ టూల్(password checkup) గూగుల్‌లో అందుబాటులో ఉంది. దీని సాయంతో మీ పాస్‌వర్డ్ బలహీనమైందా.. దాంతో ఏదైనా ప్రమాదం ఉందా అనేది చెప్పేస్తుంది.

మరి గూగుల్ చెప్పే ఇంటర్నెట్ ఏబీసీల గురించి తెలుసుకుని వాటిని ఆచరిస్తే.. ఇంటర్నెట్‌లో జరిగే మోసాలు, ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 8, 2021, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details