House Blurred on Google Street View: కేంద్ర ప్రభుత్వం అనుమతితో.. భారత్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న చిన్న గల్లీలు కూడా స్పష్టంగా 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. 2011లోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు భారత్‌లోకి వచ్చినప్పటికీ.. భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలైన టెక్ మహీంద్రా, జెనిసిస్తో జట్టు కట్టి తాజాగా గూగుల్ మళ్లీ తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా తొలుత 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు గూగుల్ తెలిపింది.
అయితే.. ఈ ఫీచర్‌తో మీ ఇల్లు కూడా స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుందన్న విషయం మీకు తెలుసా? దానిని ప్రైవేట్‌గా ఉంచాలని మీరు భావిస్తున్నారా? అసలు ఆ అవసరం ఉందా? సాధారణంగా మీరు గూగుల్ మ్యాప్స్‌లో వీధులను జూమ్ చేసి చూస్తున్నపుడు కొన్ని వస్తువులు, ముఖాలు అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదే ప్రైవసీగా ఉంచడం. మీరూ అలా చేసుకోవచ్చు. అసలు ఇంటిని ఎందుకు బ్లర్ చేయాలి?
- స్ట్రీట్ వ్యూలో మీ ఇంటిని కనిపించేలా ఉంచినట్లయితే.. అపరిచిత వ్యక్తులకు అవకాశం కల్పించినట్లే.
- దొంగలు, చొరబాటుదారులు లేదా ఇతర వ్యక్తులు మీ భవనానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎలా ప్రవేశించాలి వంటి అంశాలపై పూర్తి అవగాహనకు వచ్చే అవకాశముంది.
- ఇప్పటికే స్పష్టంగా కనిపించకపోయినా.. అపరిచిత వ్యక్తులకు మీ ఇంటికి సంబంధించిన కొంతైనా సమాచారం గూగుల్ మ్యాప్స్ ఇచ్చే ఉంటుంది.
- వాహనం కూడా ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారన్నది చూడొచ్చు.
- ముఖ్యంగా.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్లే.. మీ కదలికల్ని స్ట్రీట్ వ్యూతో పసిగట్టే ఆన్లైన్ స్టాకర్లు ఉంటారు. వీటి ఆధారంగా వారు డబ్బులు డిమాండ్ చేయొచ్చు. ఇవే కాకుండా గూగుల్ మ్యాప్స్‌ను చాలా వరకు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంది.
గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఇంటిని బ్లర్ చేయడం క్లిష్టతరమైన ప్రక్రియ. ఇదో శాశ్వత మార్పు అని గుర్తుంచుకోవాలి. అంటే మళ్లీ దానిని అన్‌బ్లర్ చేయడం కుదరకపోవచ్చు.
మీ ఇంటిని ఎలా బ్లర్ చేయాలి?
- మొదట maps.google.com లింక్ ఓపెన్ చేయాలి.
- మీ ఇంటిని నావిగేట్ చేయండి.
- మీ ఇంటికి పక్కనే ఉన్న రోడ్డుపైకి స్ట్రీట్ వ్యూ ఐకాన్‌ను డ్రాగ్ చేయాలి.
- మీ ప్రాపర్టీపైనే దృష్టి కేంద్రీకరించాలి.
- దిగువ మూలన, రిపోర్ట్ ఎ ప్రాబ్లం అన్నదానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ.. మీ అడ్రస్ సరిగానే ఉందో చెక్ చేసుకోవాలి.(లేకుంటే మళ్లీ వెనక్కి వెళ్లి రీట్రై చేయాలి)
- మీ ఇంటిపై బ్లర్ చేసే వీలుగా ఒక ఇమేజ్ను సెట్ చేసుకోవాలి.
- రిక్వెస్ట్ బ్లర్రింగ్ టూల్‌ను ఉపయోగించి ఎందుకు అలా చేయాలనుకుంటున్నారో చెప్పాలి.
- హౌస్‌ను బ్లర్ చేయడానికి.. 'మై హోం'ను సెలక్ట్ చేయాలి.
- మీరు ఎందుకు బ్లర్ చేయాలనుకుంటున్నారో స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. వ్యక్తిగత కారణాలను కూడా పేర్కొనండి.
- తర్వాతి దశలో మీ ఈ-మెయిల్ అడ్రెస్‌ను ఎంటర్ చేయాలి.
- క్యాప్చా ధ్రువీకరణ పూర్తిచేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.