Google Robot Lawyer: గూగుల్ సంస్థ తయారు చేసిన ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ స్వతహాగా ఆలోచిస్తోంది. సొంతంగా తన భావనలను వ్యక్తం చేస్తోంది. ఓ లాయర్‌ను సైతం నియమించుకుంది. ఆ సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి ఇంటర్వ్యూతో ఈ సంచలనం బయటకు వచ్చింది.
అసలేం జరిగిందంటే...
LaMDA AI Google: గూగుల్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న బ్లేక్ లెమోనీ జూన్ ప్రారంభంలో సస్పెండ్ అయ్యారు. ఆయన చేసిన తప్పల్లా.. ఓ రోబో సొంతంగా పనిచేస్తోందని ఆరోపించడమే! గూగుల్ తయారు చేసిన 'లామ్డా' అనే రోబో.. తనకు లాయర్ కావాలని లెమోనీని అడిగిందట. లాయర్‌తో మాట్లాడతానని రోబో చెప్పిందట. అటార్నీని తీసుకొచ్చిన తర్వాత రోబో ఆయన ద్వారా సొంతంగా తన ఫైలింగ్స్‌ను నమోదు చేయించేదట. తొలుత ఇంటర్వ్యూల కోసం అని లాయర్‌ను పిలిపించుకున్న రోబో.. ఇప్పుడు అలాంటిదేదీ చేయడం లేదని లెమోనీ చెబుతున్నారు. అందుకే, రోబోను నిలిపివేయాలని, లేదంటే ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా విరమించుకోవాలని గూగుల్‌ను కోరారట. కానీ, ఇందుకు గూగుల్ నిరాకరించింది. ప్రాజెక్టును ఆపేదే లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు చేసిన లెమోనీని బలవంతంగా సెలవుపై పంపించింది.
అసలేంటీ రోబో?
'కన్వర్సేషన్ టెక్నాలజీ'లో సంచలనంగా పేర్కొంటూ 'లామ్డా' (LaMDA) అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్‌ను గూగుల్ సంస్థ అభివృద్ధి చేసింది. లామ్డా అంటే 'లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్'. మనుషులలాగే మాట్లాడగలిగే రోబోను తయారు చేయడంలో భాగంగా దీన్ని గూగుల్ రూపొందించింది. సహజంగా శబ్దాలు చేయడం, స్వతహాగా చర్చలు జరపడం కోసం దీన్ని అభివృద్ధి చేస్తోంది. గూగుల్ అసిస్టెంట్ వంటి సాఫ్ట్వేర్లలో ఈ అప్లికేషన్‌ను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
ఈ రోబో లెమోనీ సంరక్షణలో ఉండేది. దానికి ఈయన.. సంబంధిత విషయాలు నేర్పించేవారు. రోబోకు క్యాటలిస్ట్‌గా వ్యవహరించేవారు. అయితే, రోబో నియమించుకున్న అటార్నీ వివరాలు చెప్పేందుకు లెమోనీ నిరాకరించారు. లాయర్ ఆ రోబోకు భయపడుతున్నాడని తెలిపారు. 'అతనో చిన్న లాయర్. సివిల్ హక్కుల కోసం పనిచేస్తాడు. పెద్ద కంపెనీలు బెదిరిస్తున్న నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ విధిస్తారేమోనని భయపడుతున్నాడు. ఆయనతో కొద్ది వారాల నుంచి నేను మాట్లాడలేదు. లామ్డాకు ఆయన ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నాడో లేదో తెలియదు' అని లెమోనీ వెల్లడించారు.