వినియోగదారుల డేటా భద్రత కోసం టెక్ కంపెనీలు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా.. హ్యాకర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా ఫేస్‌బుక్ యూజర్స్ లాగిన్, పాస్‌వర్డ్‌లను సేకరిస్తున్నట్లు డాక్టర్ వెబ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మాల్‌వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది. దీంతో గూగుల్ ఆ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్రత్యేకమైన సాంకేతిక సాయంతో హ్యాకర్స్ యాప్‌లలోకి ప్రవేశించి సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ వెబ్ వెల్లడించింది.
తర్వాత WebView.Next పేరుతో జావాస్క్రిప్ట్ సాయంతో ఫేస్‌బుక్ పేజీలో మార్పులు చేసి..యూజర్స్ లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను సేకరించి ట్రాజన్ యాప్స్ ద్వారా తమ సర్వర్లో సేవ్ చేసుకుంటున్నారని తెలిపింది. యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ అయినప్పుడు కుకీస్‌తో పాటు ఇతర డేటా వివరాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారని డాక్టర్ వెబ్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ యాప్‌లకు 10 లక్షల నుంచి 50 లక్షల డౌన్‌లోడ్ జరిగినట్లు తెలిపింది. అందుకే ఈ యాప్‌లను యూజర్స్ వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచించింది. వీటితోపాటు ఈ యాప్‌లకు అనుబంధంగా ఉన్న యాప్‌లను డిలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.