Google PlayStore Apps: స్మార్ట్‌ఫోన్‌లో ఏ చిన్న పనిచేయాలన్నా యాప్ తప్పనిసరి. అయితే మనకు అవసరమైన యాప్‌లు కొన్ని ఫోన్‌తోపాటు వస్తే.. మరికొన్ని మన అవసరానికి తగినట్లు ప్లేస్టోర్ (ఆండ్రాయిడ్), యాప్‌స్టోర్ (యాపిల్) నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం. వీటిలో కొన్ని యాప్‌లు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదలచేస్తూ భద్రత, గోప్యత, సర్వీసుల పరంగా యూజర్‌కు మెరుగైన సేవలందిస్తుంటాయి. మరికొన్ని యాప్‌లు విడుదలైనప్పటి నుంచి అప్‌డేట్ కాకపోవడం వల్ల వాటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు సులువుగా సేకరిస్తున్నారట. ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
గూగుల్ ప్లేస్టోర్ టార్గెట్ లెవల్ ఏపీఐ ప్రమాణాలకు అనుగుణంగా విడుదలైన ఏడాదిలోపు అప్‌డేట్ ఇవ్వని యాప్‌లను ఇకమీదట యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోలేరని తెలిపింది. 2022 నవంబరు 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు గూగుల్ తన డెవలపర్ కమ్యూనిటీ బ్లాగ్ పేజ్‌లో పేర్కొంది. ఇకమీదట ప్లేస్టోర్‌లోకి వచ్చే ప్రతి యాప్, ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ అయిన ఏడాదిలోపు అప్‌డేట్ ఇవ్వకుంటే సదరు యాప్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉండదని గూగుల్ వెల్లడించింది.