Google Messages Features : గూగుల్ మెసేజెస్.. ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ప్రముఖ మెసేజింగ్ యాప్. అయితే మనం ఫోన్ కొనుగోలు చేసినప్పుడు వచ్చే సాధారణమైన ఇన్‌బాక్స్ యాప్, గూగుల్ మెసేజెస్ యాప్ రెండూ ఒక్కటే అని భావిస్తారు చాలా మంది. కానీ, సాధారణ ఇన్‌బాక్స్ యాప్ సాయంతో మనం పంపించే సందేశాల మాదిరిగానే గూగుల్ మెసేజస్ యాప్‌లోనూ సందేశాలు పంపవచ్చు. కానీ, కేవలం ఇలా మెసేజ్‌లు పంపిచండమే కాకుండా దాదాపు 11 రకాల పనులను మనం దీని సాయంతో చక్కబెట్టేయొచ్చు. మరి అవేంటో.. మీకు తెలియని ఫీచర్స్ గూగుల్ మెసేజింగ్ యాప్‌లో ఏం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మన ప్రమేయం లేకుండానే..
Schedule Messages Google Chat : గూగుల్ యాప్ ద్వారా మనం షెడ్యూల్డ్ మెసేజ్‌లను కూడా పంపొచ్చు. మన స్నేహితులకు గానీ ఇతరులకు పంపే సందేశాలను అప్పటికప్పుడే కాకుండా ఒక నిర్ణీత సమయానికి పంపాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. మనం పంపాల్సిన మెసేజ్‌ను ముందే టైప్ చేసి పెట్టుకుంటాం. ఇలా సిద్ధంగా ఉంచిన మెసేజ్‌కు మనం ఓ తేదీ, టైమ్‌ను కేటాయించవచ్చు. ఉదాహరణకు ఆగస్టు 8 అర్ధరాత్రి 2 గంటలకు ఒక వ్యక్తికి మన సందేశం డెలివరీ అయ్యే విధంగా డేట్, టైమ్‌ను సెట్ చేస్తే.. సరిగ్గా అదే సమయానికి ఆ సందేశం మన ప్రమేయం లేకుండానే ఆగస్టు 8న అతనికి చేరుతుంది.
హై-క్వాలిటీ వీడియోలనూ పంపొచ్చు..
Google Messages High Quality Video : సాధారణంగా ఎంఎంఎస్ ద్వారా కూడా మనం వీడియోలను ఇతరులకు పంపొచ్చు. కాకపోతే ఆ వీడియో వారికి చేరేసరికి దాని క్వాలిటీ పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాక తక్కువ నిడివి ఉన్న వీడియోలను మాత్రమే మామూలు మెసేజింగ్ యాప్ ద్వారా పంపొచ్చు. అయితే గూగుల్ మెసేజెస్‌లో ఇటువంటి పరిమితులు ఏమీ లేవు. చక్కటి నిడివి గల వీడియోలను హై-క్వాలిటీలో పంపించుకోవచ్చు. అయితే మీరు పంపిన వీడియో సందేశాన్ని అవతలి వ్యక్తి గూగల్ ఫొటోస్ లింక్ రూపంలో స్వీకరిస్తాడు. ఆ లింక్‌తో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు.
సందేశానికి సబ్జెక్ట్ లైన్ జోడించొచ్చు..
Google Messages Subject Line : మీరు మీ కొలీగ్‌కు ఓ అత్యవసరమైన సందేశాన్ని పంపాలని అనుకున్నప్పుడు ఈ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు. మీరు పంపే మెసేజ్‌కు ఉన్న ఆవశ్యకతను అవతలి వ్యక్తికి తెలియజేసేలా దానికి ఓ సబ్జెక్ట్ లైన్‌ను కూడా యాడ్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు పంపే సందేశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి చదవాలని యూజర్‌కు తెలియజెప్పేందుకు అర్జెంట్ అని కూడా మార్క్ చేయవచ్చు. మీ సందేశానికి సబ్జెక్ట్ లైన్‌ను జోడించినప్పుడు మీరు పంపే ఎస్ఎంఎస్ కాస్త ఎంఎంఎస్గా మారుతుంది. అయితే అన్ని మొబైల్ ఫోన్లు ఎంఎంఎస్ను సపోర్ట్ చేయవు. ఒకవేళ మీ ఫోన్లో ఈ సదుపాయం లేకపోతే ఈ ఫీచర్‌ను మీరు వినియోగించలేరు.
ఫ్లోటింగ్ చాట్ బబుల్స్‌తో మరింత ఈజీగా..
Floating Chat Bubbles Google Messages Android : మీరు ఏదైనా పనిలో లీనమయినప్పుడు. మీ మొబైల్‌కు వచ్చే అతిముఖ్యమైన సందేశాలను చూడలేకపోతారు. అలాంటప్పుడు మీరు ఫ్లోటింగ్ చాట్ బబుల్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనితో మీరు మీ ఫోన్‌ను పక్కన పెట్టుకొని పనిచేసేటప్పుడు ఏదైనా సందేశం వస్తే దాన్ని మీరు సులువుగా గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు మెసేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బబుల్స్ అండ్ టాగుల్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండి. కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ఫ్లోటింగ్ నోటిఫికేషన్స్ పేరుతో ఈ ఫీచర్‌ను గమనించవచ్చు.
కంప్యూటర్లోనూ గూగుల్ మెసేజ్
Google Messages On Desktop : గూగుల్ మెసేజెస్ స్పెషాల్టీ ఏంటంటే.. దీనిని మన డెస్క్‌టాప్ కంప్యూటర్లోనూ సులభంగా ఇన్స్టాల్ చేసుకుని వాడొచ్చు. ఇందుకోసం యాప్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ తప్పనిసరి. అలా సెట్ చేసుకున్న తర్వాత మీ పీసీలోనే మీరు సందేశాలను చూడొచ్చు, చదవచ్చు. దీనితో మెసేజెస్ కోసం తరచుగా ఫోన్ చూడాల్సిన పని కూడా తగ్గుతుంది.