అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఏటా సాఫ్ట్వేర్ అప్డేట్లు, కంపెనీ ఉత్పత్తులను Google I/O 2023 ద్వారా ప్రకటిస్తూ ఉంటుంది. Google I/O అనేది అమెరికాలోని కాలిఫోర్నియా.. మౌంటెన్‌వ్యూలో నిర్వహించే వార్షిక డెవలపర్ సమావేశం. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి జరిగిన సమావేశంలో భారీగానే ప్రకటనలు చేసింది.
అయితే తాజా అప్డేట్లలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఫోన్లకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. అందులో ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ 14 వెర్షన్, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, తమ సంస్థ నుంచి మొట్ట మొదటి ఫోల్డబుల్ ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold), పిక్సెల్ ట్యాబ్లెట్ (Pixel Tablet), పిక్సెల్ 7ఏ (Pixel 7a) స్మార్ట్‌ఫోన్ తదితర ఉత్పత్తులకు సంబంధించిన అంశాలతో పాటు సాఫ్ట్‌వేర్‌పరంగా చూస్తే ఫైండ్ మై డివైజ్, వాట్సాప్‌నకు వేర్‌ఓఎస్, అన్‌వాంటెడ్ ట్రాకర్ అలర్ట్ వంటి కొత్త అప్‌డేట్ల గురించి వివరించింది. అలాగే గూగుల్ సేవలకు రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ఎటువంటి సొబగులు అద్దనుందో తెలియజేసింది.
తొలి ఫోల్డబుల్ ఫోన్..
హార్డ్‌వేర్‌కు సంబంధించి గూగుల్ తమ మొట్టమొదటి ఫోల్డింగ్ ఫోన్ 'ది పిక్సెల్ ఫోల్డ్'ను లాంఛ్ చేసింది. అంతేకాకుండా ట్యాబ్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటు తమ కంపెనీ ఫోన్ పిక్సెల్ 7 సిరీస్‌లో.. కొత్తగా పిక్సెల్ 7aను కూడా లాంఛ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నీ ఇండియాలో నేటి నుంచే మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పిక్సెల్ ఫోల్డ్ ప్రత్యేకతలు..
గూగుల్ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్ ఫోన్ 'పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)'. ఇది టెన్సర్ జీ2 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోంది. 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్‌తో ఉన్న వేరియంట్ కూడా ఉంది. 4,821 ఎంఏహెచ్ బ్యాటరీని ఇస్తున్నారు. 48 ఎంపీ, 10.8 ఎంపీ, 10.8 ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా వెనుకభాగంలో ఉంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఔటర్ డిస్‌ప్లేపై 9.5 ఎంపీ కెమెరా ఉంది. ఇన్నర్ డిస్‌ప్లేలో 8 ఎంపీ కెమెరాను కూడా పొందుపర్చారు.
మొట్ట మొదటి ఫోల్డబుల్ ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) బడ్జెట్ ఫ్రెండ్లీగా..
ఫోల్డబుల్ ఫోన్ విషయానికి వస్తే.. చూడటానికి శాంసంగ్, ఒప్పో, ఇతర కంపెనీల ఫోల్డింగ్ ఫోన్లను పోలి ఉంది. 256 జీబీ వేరియంట్ ధర అమెరికా 1,799 డాలర్లు. భారత్‌లో దాదాపు ఇది రూ.1,47,500 వరకు ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 512జీబీ వేరియంట్ ధర 1,919 డాలర్లు (దాదాపు రూ.1,57,300). ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)ను కొన్నవారికి గూగుల్ పిక్సెల్ వాచ్‌ను ఉచితంగా అందించనుంది సంస్థ. అమెరికాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభమైంది.
పిక్సెల్ 7ఏ ఫోన్..
పిక్సెల్ 7a ఫోన్‌ను వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకు వచ్చింది. పిక్సెల్ 7ఏ (Pixel 7a) ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ధర రూ.43,999. లాంఛింగ్ ఆఫర్‌లో భాగంగా రూ.4,000 వరకు తగ్గింపు లభించనుంది. దీంతో ధర రూ.39,999కు దిగిరానుంది. తెరపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. టెన్సర్ జీ2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. తొలిసారి పిక్సెల్ ఏ-సిరీస్‌ను 8జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చారు. 4,385 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. వెనక భాగంలో 64 ఎంపీ, 12 ఎంపీ కెమెరా ఉంది. ముందు భాగంలో 10.8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను ఇస్తున్నారు.
పిక్సెల్ ట్యాబ్లెట్..
పిక్సెల్ ప్యాడ్‌గా పిలిచే ట్యాబ్‌ను గూగుల్ లాంఛ్ చేసింది. గూగుల్ తమ తొలి ట్యాబ్లెట్‌ను కూడా పరిచయం చేసింది. పిక్సెల్ ట్యాబ్లెట్ (Pixel Tablet) పేరిట తీసుకొస్తున్న ఈ ట్యాబ్ సైతం టెన్సర్ జీ2 ప్రాసెసర్‌తో నడుస్తోంది. 11 అంగుళాల తెర అందుబాటులో ఉంది. 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వెనుక భాగంలో 8 ఎంపీ, ముందు భాగంలోనూ 8 ఎంపీ కెమెరా ఉంది. నాలుగు స్పీకర్లు ఉన్నాయి. దీని ధరను 499 డాలర్లుగా నిర్ణయించారు.
పిక్సెల్ ట్యాబ్లెట్ (Pixel Tablet) 100కు పైగా భాషల్లో..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్ తన కృత్రిమ మేథస్సు చాట్ బాట్ అయిన బార్డ్‌లో అప్డేట్స్ తీసుకొచ్చింది. డెవలపర్ ఫ్రెండ్లీ అంశాలు, వినియోగదారులు కేంద్రంగా విస్తృత స్థాయిలో సమాచారం అందించటం వంటి కొన్ని మార్పులను తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో పాటు తన ఆర్ట్ లాంగ్వేజ్ మోడల్ అయిన PalM 2 లార్జ్ కు అనేక రకాల ఫంక్షన్‌లను కూడా పరిచయం చేసింది. ప్రస్తుత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ 100కు పైగా భాషల్లో సపోర్ట్ చేస్తుంది. మరోవైపు జీమెయిల్‌కు 'హెల్ప్ మీ రైట్', 'మ్యాజిక్ ఎడిటర్' వంటి ఏఐ ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈమెయిళ్లు రాయడంలో ఉపయోగపడే 'హెల్ప్ మీ రైట్' అనే ఆప్షన్‌ను జీమెయిల్‌లో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
వీటితో పాటు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సరైన కంటెంట్ కోసం జనరేటివ్ ఏఐ, గూగుల్ మ్యాప్స్‌లో నూతన అంశాలను తీసుకువచ్చారు. కృత్రిమ మేథస్సు సాయంతో మ్యాప్స్‌లో గాలి నాణ్యత, వాతావరణ పరిస్థితి, ట్రాఫిక్, తదితర అంశాలు సైతం తెలుసుకోవచ్చు. ఫొటోను ఎడిట్ చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మ్యాజిక్ ఎరేజర్‌కు మరింత అప్‌డేటెడ్ వెర్షన్‌ను గూగుల్ తీసుకొస్తోంది. దీనికి మ్యాజిక్ ఎడిటర్‌గా నామకరణం చేసింది. మరికొన్ని నెలల్లో ఇది గూగుల్ ఫొటోస్‌లో అందుబాటులోకి రానుంది.
సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. అత్యధికంగా ఆదరణ పొందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 14ను ఆవిష్కరించింది. అయితే దీని బీటా వెర్షన్‌ను ఎంపిక చేసిన కొన్ని ఫోన్లలో తొందరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.