తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

క్రోమ్‌లో నయా మోడ్స్‌.. ఇకపై మెమొరీ, పవర్​ రెండూ సేఫ్​..! - గూగుల్​ క్రోమ్ మోడ్స్

గూగుల్ క్రోమ్‌ సిస్టమ్‌ మెమొరీని ఎక్కువగా వాడుతుందనేది ఎక్కువ మంది యూజర్లు చెప్పేమాట. క్రోమ్‌లో బ్రౌజింగ్ చేస్తే సిస్టమ్‌ పనితీరు మందకొడిగా ఉంటుందని చెబుతుంటారు. అయితే ఓ తాజా అప్‌డేట్‌తో ఈ సమస్యలనన్నింటికి గూగుల్ చెక్‌ పెట్టనుంది.

google chrome
google chrome

By

Published : Dec 13, 2022, 9:26 AM IST

Google Chrome : వెబ్‌ విహారానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం, బగ్‌ఫిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ వంటివి బ్రౌజర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. కానీ, సిస్టమ్‌ ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుందనేది చాలా మంది యూజర్ల అభిప్రాయం. అంటే, పీసీ లేదా కంప్యూటర్‌లో 8 జీబీ నుంచి 64 జీబీ ఎంతటి సామర్థ్యం ర్యామ్‌ ఉన్నా.. అందులో అధిక మొత్తాన్ని క్రోమ్‌ వాడేస్తుందని యూజర్లు అసహనం వ్యక్తం చేస్తుంటారు. దీనివల్ల పీసీ బ్యాటరీ, మెమొరీపై ఎక్కువ భారం పడుతుంది. ఎంతో కాలంగా ఇదే విషయమై గూగుల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.

గూగుల్‌ ఎట్టకేలకు ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపింది. కొత్తగా మెమొరీ సేవర్‌ ,ఎనర్జీ సేవర్ అనే రెండు కొత్త మోడ్‌లను క్రోమ్‌ బ్రౌజర్‌లో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కూడా యూజర్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ ఉపయోగించేటప్పుడు పీసీ/కంప్యూటర్‌లోని బ్యాటరీ, మెమొరీపై భారాన్ని తగ్గిస్తాయని తెలిపింది.

గూగుల్​ మెమొరీ సేవర్​

మెమొరీ సేవర్‌
క్రోమ్‌ బ్రౌజర్‌లో వెబ్‌ విహారం చేసే సమయంలో ఎన్నో ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. వాటిలో కొన్ని ఇన్‌యాక్టివ్‌లో ఉండి బ్రౌజర్‌ ఎక్కువ మెమొరీని ఉపయోగించేలా చేస్తాయి. దాంతో సిస్టమ్‌ పనితీరు మందకొడిగా సాగుతుంది. ఇలాంటి ట్యాబ్స్‌ను మెమొరీ సేవర్‌ మోడ్‌ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. దీంతో బ్రౌజర్‌తోపాటు, పీసీ/కంప్యూటర్‌ వేగంగా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. ఒకే సమయంలో క్రోమ్‌ బ్రౌజర్‌, యాప్స్‌, వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ ఉపయోగించేప్పుడు.. వీడియో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు సిస్టమ్‌ వేగంగా పనిచేసేందుకు ఈ మోడ్‌ ఉపయోగపడుతుంది.

గూగుల్​ ఎనర్జీ సేవర్​

ఎనర్జీ సేవర్
ఎనర్జీ సేవర్‌ మోడ్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ ఎంతమేర బ్యాటరీ నుంచి పవర్‌ను వాడుతుందనేది పరిశీలిస్తుంటుంది. సిస్టమ్‌ బ్యాటరీ 20 శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ మోడ్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో బ్యాగ్రౌండ్‌ యాక్టివిటీని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల యూజర్‌ సిస్టమ్‌ బ్యాటరీని ఎక్కువ సమయం ఉపయోగించుకునే వీలుంటుందని గూగుల్‌ వెల్లడించింది. యూజర్లు క్రోమ్‌ (v108) కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకుని వీటి సేవలను పొందొచ్చు. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా, దశలవారీగా పూర్తిస్థాయిలో యూజర్లకు వీటిని పరిచయం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details