తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఎలా ఓపెన్ చేయాలో తెలుసా? - ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ బార్డ్ లాంఛ్

యూజర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఈ వేదికపైనే ఏఐ టూల్‌ గూగుల్ బార్డ్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

google bard chatbot
google bard chatbot

By

Published : May 11, 2023, 11:00 PM IST

గూగుల్​ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్​ ఐ/ఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణలను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్‌ గూగుల్ బార్డ్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ , మైక్రోసాఫ్ట్ బింగ్‌ చాట్‌కు పోటీగా తీసుకొస్తున్న బార్డ్‌ను ఎలా ఉపయోగించాలి? అందులో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.

  • బ్రౌజర్‌లో గూగుల్ బార్డ్‌ అని టైప్‌ చేయగానే.. సెర్చ్‌ రిజల్ట్‌లో బార్డ్‌ చాట్‌బాట్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ట్రై బార్డ్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో రూల్స్​ పేజీని కిందకు స్క్రోల్‌ చేసి ఐ అగ్రి పై క్లిక్ చేయాలి. తర్వాత బార్డ్‌ సెర్చ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. యూజర్‌ సెర్చ్‌ బార్‌లో తనకు సమాచారం కావాల్సిన అంశం గురించి టెక్స్ట్‌ టైప్‌ చేయగానే.. బార్డ్‌ అందుకు సంబంధించిన సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో చూపిస్తుంది. వేరే వాళ్లతో చాట్ చేసినట్లుగా యూజర్‌ బార్డ్‌ నుంచి సమాచారం పొందవచ్చు.
  • మైక్రోసాప్ట్‌ ఏఐ చాట్​బాట్​ అయిన బింగ్ చాట్‌లో పరిమితులు ఉన్నాయి. కానీ, గూగుల్ బార్డ్​లో మాత్రం ఎలాంటి పరిమితులు లేవు. అయితే, ప్రస్తుతం బార్డ్ టెక్ట్స్ రూపంలో మాత్రమే సమాచారం ఇస్తుంది. అంతేకాకుండా.. బార్డ్​ను అడిగిన ప్రశ్నను యూజర్ ఒకటి కన్నా అధికసార్లు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే బార్డ్‌ ఇచ్చిన సమాచారాన్ని డాక్యుమెంట్‌ రూపంలో లేదా.. మెయిల్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు.
  • యూజర్లు తమకు అదనపు సమాచారం కావాలంటే కింద ఉండే 'గూగుల్ ఇట్' ఆప్షన్‌తో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయవచ్చు. బార్డ్‌ ఇచ్చే డేటాలో ఏవైనా పొరపాట్లు లేదా అభ్యంతరక సమాచారం ఉంటే ఫిర్యాదు చేసే ఆప్షన్ కూడా ఉంది. రిజల్ట్ పక్కన ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేస్తే వచ్చే రిపోర్ట్ లీగల్ ఇష్యూ అనే ఆప్షన్​ ద్వారా గూగుల్​కు ఫిర్యాదు చేయొచ్చు.
  • గూగుల్​ బార్డ్​లో ఇంకొన్ని ఫీచర్లు సైతం ఉన్నాయి. రీసెట్ చాట్, బార్డ్ యాక్టివిటీ వంటి ఆప్షన్లను ఇందులో పొందుపర్చారు. అప్పటివరకు చేసిన చాట్​ను డిలీట్ చేసేందుకు రీసెట్ చాట్ ఉపయోగించుకోవచ్చు. రీసెట్ చాట్ కొట్టగానే కొత్త చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. బార్డ్​ను మనం అడిగిన ప్రశ్నల జాబితాను బార్డ్ యాక్టివిటీలో చూసుకోవచ్చు.
  • ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే చాట్ చేసే అవకాశం ఉంది. భవిష్యత్​లో ప్రపంచంలోని అన్ని భాషల ద్వారా చాట్ చేసే సౌలభ్యం సహా, పొటో, వీడియో సమాచారం అందించేలా మరింత అభివృద్ధి చేస్తామని గూగుల్ తెలిపింది.

గూగుల్ జెమిని కూడా వచ్చేస్తోంది..

గూగుల్ బార్డ్‌తోపాటు మరో కొత్త ఏఐ టూల్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది. జెమిని పేరుతో తీసుకొస్తున్న ఈ చాట్‌బాట్‌ బార్డ్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌గా గూగుల్ చెబుతోంది. జెమినీ చాట్‌బాట్‌ టెక్స్ట్‌తోపాటు ఫొటోతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని వేర్వేరు యాప్‌లు, ఉత్పత్తుల్లో ఉపయోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అలానే టెక్స్ట్‌, ఫొటో, కోడింగ్‌ వంటి వాటికి సంబంధించి యూజర్లు పూర్తి సమాచారం పొందొచ్చని గూగుల్‌ పేర్కొంది. ప్రస్తుతం జెమిని పరీక్షల దశలో ఉందని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు పరిచయం చేస్తామని వెల్లడించింది.

గూగుల్‌ క్రోమ్‌లో అప్‌డేట్స్‌
క్రోమ్‌ బ్రౌజర్‌లో కొత్త అప్‌డేట్‌లను గూగుల్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రీడింగ్ లిస్ట్, మెమొరీ సేవర్, ఎనర్జీ సేవర్ అనే మూడు కొత్త మోడ్​లను గూగుల్ పరిచయం చేసింది. క్రోమ్​లో యాక్టివ్​గా లేని ట్యాబ్​లు మెమొరీని ఉపయోగించుకోకుండా మెమొరీ సేవర్ ఆప్షన్ అడ్డుకుంటుంది. దీనివల్ల సిస్టమ్‌ వేగంగా పనిచేస్తుంది. సిస్టమ్‌ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు ఎనర్జీ సేవర్‌ మోడ్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో బ్యాగ్రౌండ్‌ యాక్టివిటీని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తుంది. సిస్టమ్ బ్యాటరీ ఎక్కువ సేపు పనిచేసేలా ఈ ఆప్షన్ ఉపకరిస్తుంది. తద్వారా యూజర్ ఎక్కువ సేపు సిస్టమ్​ను ఉపయోగించుకునే వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. గతంలో బ్రౌజ్ చేసిన ట్యాబ్​లను తిరిగి చూసుకునేందుకు రీడింగ్ లిస్ట్ ఉపయోగపడుతుంది. ఒక్క క్లిక్​తో పాత ట్యాబ్​లన్నీ కనిపిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details