Google Banned Apps : యూజర్ల ఫోన్లకు హాని కలిగించే 13 ఆండ్రాయిడ్ యాప్స్‌ను టెక్ దిగ్గజం గూగుల్ బ్యాన్ చేసింది. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. 25 యాప్‌ల్లో Xamalicious మాల్వేర్ ఉన్నట్లు ఇటీవల మెక్అఫీ మొబైల్ రిసెర్చ్ టీమ్ గుర్తించింది. అందులో కొన్ని యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు కనుగొంది. ఈ డేటా ఆధారంగా వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకుంది గూగుల్.
Xamalicious అంటే Xamarin అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన మాల్వేర్ అని మెక్అఫీ మొబైల్ రిసెర్చ్ టీమ్ తెలిపింది. ఈ Xamalicious చేసే మోసాల గురించి వివరించింది. 'Xamalicious బారిన పడిన యాప్‌లు సోషల్ ఇంజినీరింగ్ వ్యూహాల ద్వారా యూజర్ల ఖాతాల యాక్సెస్‌ను పొందుతాయి. ఫలితంగా మొబైల్ యూజర్‌కు తెలియకుండా కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్‌తో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత సర్వర్, మొబైల్లో రెండో పేలోడ్ (మాల్వేర్)ను ఇన్స్టాల్ చేస్తుంది. అనంతరం యూజర్ మొబైల్ సర్వర్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి యాజర్‌కు తెలియకుండా యాడ్లపై క్లిక్ చేయడం, ఇతర యాప్‌లను ఇన్స్టాల్ చేయడం వంటి మోసపూరిత చర్యలకు ఆ మాల్వేర్ పాల్పడుతుంది' అని రిసెర్చ్ టీమ్ పేర్కొంది.