Android Latest Version 2022 : యాపిల్ ఐఓఎస్ మాదిరిగానే గూగుల్ ఆండ్రాయిడ్ సైతం నిరంతరం అప్‌డేట్లు, కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతోంది. ఆత్మీయులతో సంభాషించటం దగ్గర్నుంచి మరింత వినోదాన్ని పొందటానికీ వినూత్న సదుపాయాలు కల్పిస్తోంది. తేలికగా షేరింగ్ చేసుకోవటం, యాప్స్‌ను ఇంకాస్త బాగా వినియోగించుకోవటం, గేమ్స్‌ను కొత్తగా ఆడుకోవటం వంటి వాటి కోసం ఇటీవల కొత్త ఫీచర్లనూ తీసుకొచ్చింది. వీటిల్లో కొన్ని ఇవీ..
తేలికగా ఫైళ్ల బదిలీ
దగ్గర్లోని ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్స్ మధ్య ఫైళ్లను తేలికగా, సురక్షితంగా షేర్ చేసుకోవటానికి నియర్‌బై షేర్ యాప్ తోడ్పడుతుంది. దీంతో ఫొటోలు, వీడియోలనే కాదు మొత్తం ఫోల్డర్లనూ పంపించుకోవచ్చు. ఇందుకోసం మన గూగుల్ ఖాతాతో లాగిన్ అయిన ఆండ్రాయిడ్ పరికరాలను ఎంచుకుంటే సరి. షేరింగ్ మెనూ ద్వారా అవసరమైన ఫైళ్లను ఎటు నుంచి ఎటైనా పంచుకోవచ్చు. ఒకసారి దీన్ని ఎనేబుల్ చేసుకుంటే స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా కూడా మన పరికరాల మధ్య వాటంతటవే ఫైళ్లు బదిలీ అవుతాయి.
వర్క్‌స్పేస్ యాప్స్ అధునాతం
పెద్ద తెరలతో కూడిన పరికరాల కోసం గూగుల్ ఇటీవల వర్క్‌స్పేస్ యాప్స్‌ను ఆధునికీకరించింది. ఇప్పుడు మల్టీ-టాస్కింగ్‌ను సులభతరం చేయటానికి ట్యాబ్లెటకూ గూగుల్ యాప్స్‌ను అప్‌డేట్ చేయటం ఆరంభించింది. ఇందులో భాగంగా గూగుల్ డ్రైవ్, కీప్ విడ్జెట్లను మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దింది. కొత్త గూగుల్ డ్రైవ్ విడ్జెట్‌లో మూడు హోం స్క్రీన్ బటన్లు ఉంటాయి. వీటితో ఒకేసారి గూగుల్ డాక్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ షీట్స్ ఫైళ్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ కీప్‌లోనైతే పెద్ద విడ్జెట్ దర్శనమిస్తుంది. ఫాంట్ సైజూ పెద్దగానే ఉంటుంది. నోట్స్ తీసుకోవటం, చేయాల్సిన పనుల జాబితా రూపొందించుకోవటం తేలికవుతుంది. రిమైండర్లనూ తేలికగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఒకే సమయంలో వంద మందితో
గూగుల్ మీట్‌లో కొత్త షేరింగ్ అనుభవాలను అందించే ఫీచర్లనూ గూగుల్ ప్రవేశ పెడుతోంది. లైవ్ షేరింగ్ ఫీచర్ ద్వారా అదే సమయంలో ఇతరులతో కలిసి ఇష్టమైన యూట్యూబ్ వీడియోలను చూసుకోవచ్చు. ఒకే సమయంలో వంద మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లకు అమలు చేయనుంది.