Gmail Shortcuts: ఇప్పుడు ఈమెయిల్ నిత్యావసరంగా మారింది. ఆఫీసు వ్యవహారాలైనా, వ్యాపార వివరాలైనా, వ్యక్తిగత సమాచారమైనా.. ఏది పంపించుకోవటానికైనా ఇదే తేలికైన మార్గం మరి. ఈమెయిల్ సేవల్లో ఎక్కువమంది వాడేది జీమెయిల్. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లోనే కాదు, ఎప్పుడూ వెంట ఉండే స్మార్ట్‌ఫోన్‌లోనూ జీమెయిల్‌ను ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే చాలామందికి ఆండ్రాయిడ్ ఫోన్లలోని జీమెయిల్ యాప్‌లో దాగున్న షార్ట్‌కట్స్ గురించి పెద్దగా తెలియదనే అనుకోవాలి. వీటి ఉపయోగాల గురించి తెలిస్తే ఎవరైనా 'ఔరా' అనాల్సిందే!
వినూత్న ఫార్మాటింగ్ కమాండ్స్.. జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో కంపోజ్ చేస్తున్నప్పుడు అంతా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎలాంటి ఫీచర్లు లేనట్టుగానే అనిపిస్తుంది. కానీ కొత్త ఈమెయిల్‌ను రాస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నచోట కొద్దిసేపు అలాగే వేలితో నొక్కిపట్టి ఉంచితే ఫార్మాట్ ఆప్షన్ కనిపిస్తుంది. వినూత్న టెక్స్ట్ ఫార్మాటింగ్ కమాండ్స్ దర్శనమిస్తాయి. వీటితో మెయిల్‌లో ఏ భాగాన్నయినా బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్.. ఇలా రకరకాలుగా టెక్ట్స్‌ను మలచుకోవచ్చు. కావాలంటే టెక్స్ట్ వెనకాల రంగునూ వేసుకోవచ్చు, రంగు మార్చుకోవచ్చు. వద్దనుకుంటే అన్ని టెక్ట్స్ స్టైళ్లను ఒక్క ట్యాప్‌తోనే క్లియర్ చేసుకోవచ్చు కూడా.
ఒక్క స్వైప్‌తోనే.. ఇన్‌బాక్స్‌లోని మెసేజ్‌లను స్నూజ్ చేయటానికి, అన్‌రీడ్ గుర్తు పెట్టుకోవటానికి తేలికైన మార్గముంటే ఎంత బాగుంటుందో అని చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఒక్క స్వైప్‌తోనే వీటిని సుసాధ్యం చేసుకునే మార్గం లేకపోలేదు. జీమెయిల్ యాప్‌ను ఓపెన్ చేసి, ఎడమవైపున అడ్డం మూడు గీతల గుర్తును నొక్కి, సెటింగ్స్ ద్వారా 'జనరల్ సెటింగ్స్'లోకి వెళ్లాలి. ఇందులో 'స్వైప్ యాక్షన్స్' ఫీచర్‌ను ఎంచుకొని.. ఇన్‌బాక్స్ నుంచి మెయిల్‌ను కుడివైపునకు లేదా ఎడమవైపునకు జరిపేలా కన్ఫిగరేషన్ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు- కుడివైపునకు జరిపితే ఆర్కయివ్, ఎడమ వైపునకు జరిపితే స్నూజ్ వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ఒక అకౌంట్ నుంచి మరో అకౌంటుకు..ఒకటే గూగుల్ ఖాతా ఉండాలనేముంది. ఉద్యోగ అవసరాలకు ఒకటి, వ్యక్తిగత పనులకు ఒకటి.. ఇలా వేర్వేరు ఖాతాలను నిర్వహించుకోవటం కొత్తేమీ కాదు. ఇలా ఒకటి కన్నా ఎక్కువ గూగుల్ ఖాతాలు ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని ఉన్నట్టయితే వేర్వేరు ఖాతాలకు మారటం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండొచ్చు. దీనికీ సులువైన మార్గముంది. జీమెయిల్ యాప్‌లో ప్రొఫైల్ పిక్చర్ మీద వేలు పెట్టి, పైకి లేదా కిందికి స్వైప్ చేస్తే చాలు. వేరే ఖాతాలోకి తేలికగా మారిపోవచ్చు.
ఐడీ కాపీ తేలికగా..మెయిల్‌ను చదువుతూనే దాన్ని పంపించినవారి ఐడీని కాపీ చేసుకోవాలని అనుకుంటున్నారా? అక్కడ్నుంచే విడిగా కొత్త మెయిల్ థ్రెడ్‌ను ఆరంభించాలని భావిస్తున్నారా? అయితే మెయిల్‌ను పంపించినవారి పేరు మీద కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచండి. అప్పుడు వారి మెయిల్ ఐడీతో పాటు సెండ్ మెయిల్, కాపీ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి సాయంతో మెయిల్ ఐడీని కాపీ చేసుకొని అవసరమైనవారికి షేర్ చేసుకోవచ్చు. సెండ్ మెయిల్ ద్వారా కొత్త మెయిల్ థ్రెడ్‌ను ప్రారంభించొచ్చు.
- చూస్తున్న మెయిల్‌లో టెక్స్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసినా కాపీ, షేర్, సెలెక్ట్ ఆల్, వెబ్ సెర్చ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటితోనూ ఎంతో సమయం ఆదా అవుతుంది.
- మెయిల్ థ్రెడ్‌లో ‘రిప్లై ఆల్’కు బదులు ‘రిప్లై’ బటన్ నొక్కారా? లేదూ ఒకరికే రిప్లై ఇవ్వాల్సి ఉంటే రిప్లై ఆల్ బటన్ ఎంచుకున్నారా? ఇబ్బందేమీ లేదు. డ్రాఫ్ట్ మెయిల్ మొత్తాన్ని డిలీట్ చేసి, తిరిగి కొత్తగా ఆరంభించాల్సిన పనిలేదు. యాప్‌లో పైన కనిపించే 'రిప్లై ఆల్ లేదా రిప్లై' మీద ట్యాప్ చేస్తే చాలు. కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కావాలంటే అక్కడ్నుంచే ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు.
ప్రమోషన్స్ మెయిళ్లు ఇబ్బంది పెట్టకుండా.. జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో ప్రమోషన్స్ విభాగం ఒకరకంగా వరం. మరోరకంగా శాపం. అంతగా చూడని మెయిళ్లను ఇది ఇన్‌బాక్స్ నుంచి వేరు చేస్తుంది. కానీ కొన్ని యాడ్స్‌నూ మోసుకొస్తుంది. మెయిళ్ల క్రమంలో మార్పులు చేస్తుంది. యాడ్స్ విషయంలో పెద్దగా చేయగలిగిందేమీ లేదు. కానీ మెసేజ్‌లు రీఆర్డర్ కాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం జీమెయిల్ జనరల్ సెటింగ్స్‌లోకి వెళ్లి, గూగుల్ అకౌంట్ చిరునామా ద్వారా 'ఇన్‌బాక్స్ కేటగిరీ’ని ట్యాప్ చేయాలి. ఇందులో స్క్రోల్ చేస్తూ అన్నింటికన్నా కింద ఉండే 'ఎనేబుల్ టాప్ పిక్స్' బాక్స్‌ను అన్‌చెక్ చేయాలి. అంతే. ఇది 'హై వ్యాల్యూ'గా భావించే ప్రమోషన్ మెయిళ్లను అన్నింటికన్నా పైన కనిపించకుండా చేస్తుంది.
సర్వీస్ శుభ్రం.. జీమెయిల్ యాప్ ఓపెన్ చేయగానే కింద మెయిల్, ఛాట్, స్పేసెస్ వంటి వాటితో కూడిన నావిగేషన్ బార్‌ను చూసే ఉంటారు. కొన్నిసార్లు ఇది చికాకుకు గురిచేయొచ్చు. తెరలో కొంత భాగాన్ని ఇదే ఆక్రమిస్తుందని అనిపించొచ్చు. మరి దీన్ని కనిపించకుండా చేయటమెలా? జనరల్ సెటింగ్స్‌లోకి వెళ్లి, అకౌంట్ పేరు మీద ట్యాప్ చేయాలి. అక్కడ్నుంచి 'జనరల్' విభాగంలో 'ఛాట్' బాక్స్‌ను అన్‌చెక్ చేయాలి. అలాగే కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్లి 'మీట్' విభాగం కింద కనిపించే 'షో ద మీట్ ట్యాబ్ ఫర్ వీడియో కాలింగ్' బాక్స్‌నూ అన్‌చెక్ చేసుకోవాలి.
పొరపాట్లకు చెల్లు.. మెయిల్ యాప్‌లో పొరపాటున వేరేవారి ఐకన్‌ను తాకటం తరచూ జరిగేదే. ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవటానికి జీమెయిల్‌లో మంచి ఆప్షన్ ఉంది. అదే 'యాక్షన్ కన్ఫర్మేషన్స్' ఆప్షన్. తప్పుడు ఈమెయిళ్లు పంపకుండా చూసుకోవటానికిది ఉపయోగపడుతుంది. పొరపాటున మెయిల్‌ను ఆర్కైవ్ లేదా డిలీట్ చేయకుండా చూస్తుంది. డ్రాఫ్ట్ ముగించకముందే సెండ్ బటన్‌ను నొక్కినా మరోసారి ఆలోచించుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం జీమెయిల్‌లో జనరల్ సెటింగ్స్‌లోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేస్తూ 'యాక్షన్ కన్ఫర్మేషన్స్' ఆప్షన్‌లో అవసరమైనవి (కన్‌ఫర్మ్ బిఫోర్ డిలీటింగ్, కన్‌ఫర్మ్ బిఫోర్ ఆర్కైవింగ్, కన్‌ఫర్మ్ బిఫోర్ సెండింగ్) యాక్టివేట్ చేసుకోవాలి.
రాస్తున్న మెయిల్ నుంచే.. మెయిల్ రాస్తున్నప్పుడో.. రిప్లయి ఇస్తున్నప్పుడో.. ఫార్వర్డ్ చేస్తున్నప్పుడో మధ్యలో మరో ఎవరినైనా యాడ్ చేయాల్సి వస్తే? రాయటం ఆపేసి, మెయిల్ పైకి వెళ్లి వారి మెయిల్ ఐడీని జతచేస్తారు కదా. కానీ రాస్తున్న మెయిల్ నుంచే జత చేసే అవకాశముందని తెలుసా? జీ అని టైప్ చేసి వారి పేరులోని మొదటి ఒకట్రెండు అక్షరాలు టైప్ చేస్తే చాలు. ఆయా వ్యక్తుల ఫోన్ నంబరు కాంటాక్ట్స్‌లో ఉన్నట్టయితే వారి పేరు ప్రత్యేక బాక్సులో ప్రత్యక్షమవుతుంది. ప్రొఫైల్ పిక్చర్‌ను తాకితే నేరుగా అడ్రస్ ఫీల్డ్‌లో వారి ఈమెయిల్ ఐడీ వచ్చి చేరుతుంది.
ఎంచుకున్న నోటిఫికేషన్లే.. ఈమెయిల్ నోటిఫికేషన్లు చాలావరకు మేలే చేస్తాయి. తాజా మెయిళ్ల గురించి వెంటనే తెలియజేస్తాయి. కానీ అవసరం లేని నోటిఫికేషన్లతోనే ఇబ్బంది. హై-ప్రయారిటీ నోటిఫికేషన్ ఆప్షన్‌తో దీన్ని తేలికగా తప్పించుకోవచ్చు. ఇది కృత్రిమ మేధ సాయంతో మెసేజ్‌లను విశ్లేషించి, నిజంగా అవసరమైన వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను మాత్రమే అందిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవటానికి ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ్నుంచి గూగుల్ ఖాతాను ఎంచుకోవాలి. ఇందులో 'నోటిఫికేషన్స్' బటన్‌ను నొక్కితే ఆల్, హై ప్రయారిటీ ఓన్లీ, నన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో హై ప్రయారిటీ ఓన్లీ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి. ఒకవేళ ఎలాంటి ఈమెయిళ్ల నోటిఫికేషన్లు అందాలనేది కచ్చితంగా తెలిసి ఉంటే (ఉదా: ఆయా వ్యక్తుల పేర్లు, డొమైన్ పేర్లు, ప్రత్యేక పదాల వంటివి) కృత్రిమ మేధ ఆప్షన్‌ను వదిలేయొచ్చు. సొంతంగా ప్రత్యేక జీమెయిల్ నోటిఫికేషన్లను సెట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి:వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వర్డింగ్ ఇక కష్టమే! ఒకేసారి ఐదుగురికి కాదు ఒకరికే!!