దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతోంది. కరోనా వల్ల గతేడాది భౌతికంగా నగదు చెల్లింపులు.. తగ్గి డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. లాక్డౌన్ సమయంలోనైతే ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. బిల్లులు చెల్లించేందుకు, వస్తువుల కొనుగోలుకు చాలా మంది ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు జరిపారు.
మహమ్మారి వల్ల డిజిటల్ వేదికల వినియోగం వేగవంతమైంది. అదే విధంగా సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసేటప్పుడు పూర్తి అప్రమత్తతతో ఉండాలి. సురక్షితమైన వేదికలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులు చేసే వారైనా లేదా కొత్తగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నా.. ప్రతి సారి ఆన్లైన్ చెల్లింపులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.
ఉచిత వైఫైతో జాగ్రత్త..
రెస్టారెంట్లు, బస్ స్టాండ్లు, హోటళ్లు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం ఉచిత వైఫై సౌకర్యం లభిస్తోంది. మొబైల్నెట్వర్క్ లేకపోవటం వల్ల, వేగంగా ఇంటర్నెట్ లభిస్తుందనే కారణాలతో చాలా మంది వీటికి కనెక్ట్ చేసుకుని వాడుతుంటారు.
అయితే పబ్లిక్ వైఫైలో సెక్యూరిటీ అంతగా ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల హ్యాకర్స్‌కి ఇవి లక్ష్యాలుగా మారుతుంటాయని వారు చెబుతున్నారు. ఈ కారణంగా పబ్లిక్ వైఫై వాడితే.. ఎలాంటి లావాదేవీలు జరపకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. కచ్చితంగా వాడల్సి వస్తే మాత్రం వీపీఎన్ ఉపయోగించడం కాస్త సురక్షితమంటున్నారు.
క్లిష్టమైన పాస్వర్డ్, ఓటీపీ..
పాస్వర్ట్ ఖచ్చితంగా క్లిష్టంగా ఉండేలా చూసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోని వై-ఫై విషయంలో కూడా ఇతరులు కనుక్కోలేనంత క్లిష్టంగా పాస్వర్డ్ పెట్టుకోవాలంటున్నారు.
ఆన్లైన్ చెల్లింపుల విషయంలో పాస్వర్డ్ బదులు వన్‌టైమ్ పాస్వర్డ్ ఉపయోగించుకోవటం వల్ల సెక్యూరిటీ పెరుగుతుందని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. వన్‌టైమ్ పాస్వర్డ్లు ఒకే సారి ఉపయోగపడే విధంగా ఉండటం సహా రిజిస్టరైన మొబైల్ ద్వారా వాటిని పొందవచ్చు. అయితే పాస్వర్డ్ లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకవేళ వేరే వాళ్లతో పంచుకున్నట్లయితే మోసాల బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ.