synthetic embryo Israel: కృత్రిమ గర్భంలో మానవ పిండాల సృష్టి.. ఇది ఏనాటికైనా సాధ్యమవుతుందన్న ఆశలు పెంచే దిశగా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఈమేరకు చిట్టెలుకపై ప్రయోగాలు చేశారు. శుక్రకణం, అండం కలవనిదే గర్భధారణ సాధ్యపడదనేది అందరికీ తెలిసిందే. అయితే చిట్టెలుక మూలకణాల (స్టెమ్ సెల్స్)ను ఉపయోగించి తాజాగా శాస్త్రవేత్తలు పిండోత్పత్తి చేశారు. ఇది ప్రయోగశాల బయోరియాక్టర్ (కృత్రిమ గర్భసంచి)లో 8 రోజులు సజీవంగా ఉంది. చిట్టెలుక గర్భధారణ వ్యవధి అయిన 16 రోజుల్లో ఇది సగం కాలం కావడం విశేషం. ఈ పిండానికి సజీవమైన చిట్టెలుకగా మారే శక్తి ఇప్పటికి లేనప్పటికీ ఇది భవిష్యత్తులో ఎన్నో పరిణామాలకు కీలకంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ETV Bharat / science-and-technology
శుక్రకణం అండం లేకుండా మూలకణాలతో కృత్రిమ పిండం - కృత్రిమ పిండం ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు
భవిష్యత్తులో ఎన్నో పరిణామాలకు కీలకంగా మారే పరిశోధన విషయంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. మూలకణాలను ఉపయోగించి పిండోత్పత్తి చేశారు. ఈ సాంకేతికత మున్ముందు పూర్తిగా అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి చర్మకణం నుంచి అవయవాలను సృష్టించడానికి, కృత్రిమ పిండం అభివృద్ధికి వీలవుతుందని శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నారు.
ప్రయోగాలు.. ఫలితాలు:
synthetic embryo development:ప్రయోగంలో భాగంగా ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన కృత్రిమ గర్భాశయం ఎలుక సహజ గర్భాశయంలో ఉండే వాతావరణ ఒత్తిడిని ఉత్పన్నం చేస్తోంది. అందులో పోషక పదార్థాలు నింపిన గాజు సీసాలు ఉంటాయి. బయోరియాక్టర్ గిర్రున తిరగడం వల్ల పోషకాలు గర్భస్థానికి అందుతాయి. ప్రయోగంలో ఉపయోగించిన మూలకణాల్లో 0.5% మాత్రమే 8 రోజుల పిండంగా రూపుదిద్దుకున్నాయి. ఆ పిండంలో గుండె, నాడీ వ్యవస్థ కనిపించాయి. మిగిలిన కణాలు రకరకాల అవయవాలుగా, కణజాలంగా రూపొందాయి. ఈ ప్రయోగం ఏదో ఒకనాడు కృత్రిమ గర్భలో మానవ పిండాల సృష్టికి దారితీయవచ్చని విశ్వసిస్తున్నారు. ప్రపంచమంతటా ఏటా 3 లక్షల మంది మహిళలు ప్రసవ సమస్యల వల్ల చనిపోతున్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల మరణాలూ సంభవిస్తున్నాయి. కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ఈ సమస్యలకు పరిష్కారం చూపగలదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ప్రయోగశాలలో కృత్రిమ గుండె, మూత్రపిండాలు, మెదడు తదితర అవయవాల సృష్టికీ ఇది ఉపకరిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు.
భవిష్యత్తులో..
ఈ సాంకేతికత మున్ముందు పూర్తిగా అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి చర్మకణం నుంచి అవయవాలను సృష్టించడానికి, కృత్రిమ పిండం అభివృద్ధికి వీలవుతుందని శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. ఈ తరహా కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (ఐపీఎస్) అంటారు. సజీవ వ్యక్తి నుంచే కాకుండా, మరణించిన వ్యక్తి నుంచి తీసిన చర్మ కణాలను (ఐపీఎస్ కణాలను) కూడా పిండంగా మార్చే రోజు భవిష్యత్తులో రావచ్చని, అలా సృష్టించిన పిండం నుంచి మానవ ప్రతిరూపాన్నీ (క్లోన్) సృష్టించవచ్చని నమ్ముతున్నారు. అయితే ఇలాంటి సృష్టి అనేక నైతిక, చట్టపరమైన ప్రశ్నలనూ లేవనెత్తుతోంది.