Artemis 1 Space Launch : మానవుడి విశ్వాన్వేషణలో చరిత్రాత్మక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. గతంలోలా నామమాత్రపు సందర్శనలతో సరిపుచ్చకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేయనుంది. లోతైన పరిశోధనలకు వేదిక ఏర్పాటు చేయనుంది. అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు మాత్రం మానవసహితంగానే సాగుతాయి.
మళ్లీ చందమామపైకి ఎందుకు?
1960లలో చందమామపైకి మానవసహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా 'అపోలో' ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై గడపలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు.
ఇందులో భాగంగా వచ్చే పదేళ్లలో జాబిలిపై దీర్ఘకాల ఆవాసాలను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. వంతులవారీగా వ్యోమగాములను అక్కడ ఉంచాలనుకుంటోంది. చంద్రుడి ఉపరితలం నుంచి నీరు, ఇతర వనరులను ఒడిసిపట్టాలనుకుంటోంది. అంతిమంగా అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తోంది. ఈ దిశగా అర్టెమిస్-1 విజయం పునాదులు వేస్తుంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) అనే రాకెట్, ఒరాయన్ అనే క్యాప్సూల్ ఉన్నాయి.
ఒరాయన్
ఎస్ఎల్ఎస్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సూల్ ఉంటుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పనిచేయగలదు. ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ కీలకం. రోదసి యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొనేలా దీన్ని తయారుచేశారు. క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సౌరఫలకాలు ఉంటాయి.
సోమవారం పంపిన ఆర్టెమిస్-1 లోని కమాండర్ సీటులో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్ సూట్‌ను తొడిగారు. రేడియోధార్మికత నుంచి ఇది ఎంత మేర వ్యోమగామిని రక్షిస్తుందన్నది పరిశీలిస్తారు. ఇది కాక హెల్గా, జోహర్ అనే రెండు బొమ్మలు కూడా ఒరాయన్‌లో ఉంటాయి. మానవ కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని తయారుచేశారు. ఇవి సుదూర అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి.