Facebook Subscription Plan News : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ :
Instagram Ad Free Subscription : మెటా సంస్థ.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లపై 14 డాలర్ల వరకు యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఛార్జీ విధించవచ్చు అని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మెటా అధికారులు ఇప్పటికే ఈ విషయం గురించి ఐర్లాండ్, బ్రస్సెల్స్, ఈయూ ప్రైవసీ రెగ్యులేటర్లతో చర్చించారని వెల్లడించింది.
గేట్ కీపర్స్!
EU Gatekeeper Companies : యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి మెటా కంపెనీకి 'గేట్ కీపర్స్' స్టేటస్‌ను ఇచ్చింది. వాస్తవానికి ఈయూ తీసుకువచ్చిన ఈ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ ప్రకారం, కంపెనీలు యూజర్ల డేటాను.. తమ ఇతర సర్వీసులతో, ఇతర కంపెనీలతో పంచుకోకూడదు. అలాగే యూజర్ల అనుమతి లేకుండా వారిపై ఎలాంటి ఇతర పరిమితులు విధించకూడదు.
ప్రస్తుతం అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు..యూరోప్ మార్కెట్లోనూ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు, పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు ఈయూ సరికొత్త డిజిటల్ మార్కెట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అంటే యూరోపియన్ యూజర్ల ప్రయోజనాలను రక్షించే దిశగా చర్యలు చేపట్టింది.
యూరోపియన్ యూజర్లకు మాత్రమే!
Meta Subscription Plan For Europe : వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ప్రస్తుతానికి యూరోపియన్ యూజర్లకు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా డెస్క్‌టాప్‌లో వాడే ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు.. నెలవారీ సబ్స్క్రిప్షన్ కింద 10 యూరోలు లేదా 10.46 డాలర్లు ఛార్జీ విధించవచ్చు. ఒక వేళ యూజర్లకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే.. ఒక్కో అదనపు ఖాతాకు 6 డాలర్ల చొప్పున సబ్స్క్రిప్షన్ ఛార్జీ విధించే అవకాశం ఉంది.