మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బాటలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నడుస్తోంది. అధికారిక ఖాతాలకు ఇచ్చే 'బ్లూ టిక్' సబ్‌స్క్రిప్షన్ సర్వీసును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించారు. 'మెటా వెరిఫైడ్' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వారంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభిస్తామని.. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. వినియోగదారులు తమ ఖాతాల రక్షణ కోసం బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు వేర్వేరుగా బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.
ఆపిల్ ఫోన్ వినియోగదారులు నెలకు రూ.991(11.99 అమెరికన్ డాలర్లు), ఆండ్రాయిడ్ వినియోగదారులు రూ.1,239 (14.99 అమెరికన్ డాలర్లు) చెల్లించి వెరిఫైడ్ ఖాతాల కింద బ్లూటిక్‌ను పొందాలని మెటా తెలిపింది. అంతకుముందు మెటా బ్లూటిక్ కోసం ఎటువంటి రుసుం వసూలు చేసేది కాదు. ఉచితంగానే ప్రముఖులు, వ్యాపారుల ఖాతాలకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చేది. ఈ కొత్త ఫీచర్ మెటా అందించే సేవల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకే తీసుకొస్తున్నామని పేర్కొంది. గతంలో వెరిఫైడ్ అయిన ప్రముఖులు బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోనవసరం లేదని తెలిపింది.