అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జెఫ్ బెజోస్ మరో రెండు రోజుల్లో వ్యోమగాముల జాబితాలో చేరనున్నారు. సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న తొలి మానవసహిత రోదసి యాత్రకు మరో ముగ్గురితో కలిసి మంగళవారం(జులై 20) పయనంకానున్నారు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగుల వేస్తోన్న 'స్పేస్ టూరిజం' రంగానికి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం!
బిలినియర్ల మధ్య రోదసియానానికి తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఇటీవలే దానిని విజయవంతంగాపూర్తి చేశారు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్. అయితే బ్లూ ఆరిజిన్ లక్ష్యాలు అంతకన్నా పెద్దవి. వ్యోమ నౌక న్యూ షెపర్డ్ చేరుకునే ఎత్తులోనూ, భవిష్యత్ ప్రణాళికలలోనూ బ్లూ ఆరిజిన్ లక్ష్యాలు వేరే స్థాయిలో ఉన్నాయి.
ఏంటీ బ్లూ ఆరిజిన్?
కృత్రిమ గ్రావిటీతో తేలియాడే స్పేస్ కాలనీలను నిర్మించే లక్ష్యాంతో 2000లో బ్లూ ఆరిజిన్‌ను స్థాపించారు బెజోస్. అక్కడ లక్షలాది మంది పని చేసుకుంటూ, జీవించగలగాలని కలలు సంకల్పించారు.
ప్రస్తుతం ఈ సంస్థ.. హెవీ లిఫ్ట్ ఆర్బిటల్ రాకెట్ న్యూ గ్లెన్ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఓ మూన్ ల్యాండర్ కూడా తయారు చేసి నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగస్వామి కావాలని చూస్తోంది.
జులై 20న పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్ దూసుకెళ్లనుంది. దీనిని గంటన్నర ముందు నుంచే BlueOrigin.comలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
రోదసి వీరులు..
బెజ్స్ రోదసి వీరుల జాబితాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పూర్తి స్వయంచాలిత ఫ్లైట్‌లో.. బెజోస్‌తో పాటు ప్రముఖ మహిళా పైలట్ వేలీ ఫంక్ వెళ్లనున్నారు. ఆమెకు 82 ఏళ్లు. దీనితో ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. వీరితో పాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్ డేమన్.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు.
ఇక మిగిలిన ఆ నాలుగో వ్యక్తి బెజోస్ సోదరుడు, బెజోస్ కుటంబానికి చెందిన ఫౌండేషన్ నిర్వాహకులు మార్క్. అయితే ఈ యాత్ర కోసం తొలుత వేలంలో రూ.206కోట్లు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.
ప్రత్యేకతలు..
- లిక్విడ్ హైడ్రోజన్/లిక్విడ్ ఆక్సిజన్ ఇంజన్‌తో గంటకు 3700 కిలోమీటర్లకు పైగా(మాక్ 3) వేగంతో న్యూ షెపర్డ్ నింగిలోకి దూసుకువెళ్తుంది. దీని ద్వారా ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు.
- ఆ తర్వాత వ్యోమగాములు ఉన్న క్యాప్సుల్ బూస్టర్ నుంచి విడిపోతుంది. అనంతరం వారు భారరహిత స్థితి అనుభూతిని పొందుతారు.
- కర్మాన్ రేఖ (భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో భూవాతావరణానికి, రోదసికి సరహద్దు) ఆవల కొన్ని నిముషాలు గడుపుతారు. ఈ వ్యోమనౌక 65 మైళ్ల (106కి.మీలు) ఎత్తువరకు వెళ్లగలదు.
- అక్కడి నుంచి భూమిని, విశ్వాన్ని క్యాబిన్ నుంచి వీక్షిస్తారు.
- ఆ తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుకుంటుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.
భవిష్యత్తులో ఏం చేయబోతోంది?
గోప్యత ఈ సంస్థ ప్రధాన విధానంగా కనబడుతోంది. ఈ తొలి రోదసి యాత్ర మినహా రాబోయే రోజులకు సంబంధించిన ఇతర విశేషాలను పెద్దగా వెల్లడించలేదు.
అయితే ఏడాది మరో రెండు యాత్రలను చేపట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. ఈ రోదసియానాలు బాగా రిస్క్‌తో కూడిన వ్యవహారం అయినందున తొలి యాత్రల ద్వారా లభించే డిమాండ్‌పై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:బెజోస్ వ్యోమనౌక వెనుక.. భారత యువతి