E Bike Fire Incidents: ఎలక్ట్రిక్ బైక్‌లు.. ఇటీవల మార్కెట్లోకి కోకొల్లలుగా వస్తున్నాయి. కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ప్రజలు ముఖ్యంగా యువత ఈ- బైక్‌ల కొనుగోలుకు మొగ్గుచూపుతోంది. పర్యావరణహితమైన వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను రాయితీలను కూడా ప్రకటించింది. పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు ప్రత్యామ్నాయంగా కనిపించడం, తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజీ వంటి ప్రత్యేక ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇది నాణేనికి ఒక వైపు.
ఛార్జింగ్ పెడుతుండగా ఈ-బైక్‌లలో మంటలు, పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో దగ్ధం.. ఇది మరో కోణం. ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలుకోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు, వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్లో మార్చి 26 రాత్రి జరిగింది. తమిళనాడులోనే తిరువళ్లూరులో ఇంటిముందు పార్క్ చేసిన స్కూటర్ కాలిపోవడమే కాకుండా.. ఇంట్లోని సుమారు 3 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది.
కొద్దిరోజుల కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఓ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో ఛార్జింగ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయింది. మహారాష్ట్ర పుణెలోనూ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ చూస్తే.. ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా కనిపిస్తున్న ఈ ఈ-బైక్‌ల తయారీలో కంపెనీలు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయా? లేదా? అనే సందేహం కలగకమానదు. గతంలో కొన్ని ఫోన్లు(ముఖ్యంగా చైనా ఫోన్లు) పేలిపోవడం వంటి ఘటనలు ఎన్నో చూశాం. ఇప్పుడు బైక్‌లే కాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఈ-బైక్‌లను కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది.