దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది.
హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్ తదితర ప్రాంతాల్లో 5జీ ట్రయల్స్ జరగనున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 700 మెగాహెర్జ్ బ్యాండ్, 3.3- 3.6 గిగాహెర్జ్ బ్యాండ్, 24.25- 28.5 గిగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
చైనా సాంకేతికత వాడొద్దు..
దేశంలో 5జీ ట్రయల్స్ నిర్వహణకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్ కంపెనీలకు మే 4న డాట్ అనుమతిచ్చింది. ఏ కంపెనీ కూడా చైనా సాంకేతికతను ఉపయోగించకూడదని షరతు విధించింది. ఇందుకు లోబడి కంపెనీలు కూడా ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్‌తో జట్టు కట్టి ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి.
6 నెలల పాటు ట్రయల్స్..
రిలయన్స్ జియో మాత్రం దేశీయంగా తాను సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగిస్తోంది. ట్రయల్స్‌లో భాగంగా టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి పరీక్షించనున్నారు. మొత్తం 6 నెలల పాటు ట్రయల్స్ జరగనున్నాయి. ప్రతి కంపెనీ పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లో మాత్రం ఏ కంపెనీకీ స్ప్రెక్ట్రమ్ కేటాయించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:Bitcoin: క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌పై నీలి నీడలు